Updated : 21 Mar 2022 14:13 IST

Ghulam Nabi Azad: గులాంనబీ ఆజాద్‌.. రాజకీయాలకు గుడ్‌బై చెప్పనున్నారా..?

రాజకీయ పార్టీల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన కాంగ్రెస్‌ దిగ్గజనేత

దిల్లీ: గత కొంతకాలంగా కాంగ్రెస్‌ అధిష్ఠానాన్ని ఎదిరిస్తోన్న సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌.. కాంగ్రెస్‌తోపాటు ఇతర రాజకీయ పార్టీలన్నింటిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు మరోసారి పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రజల్లో విభజన తెచ్చేందుకు రాజకీయ పార్టీలన్నీ ప్రయత్నాలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాను రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్లు ఏ క్షణమైనా ప్రకటించవచ్చనే ముందస్తు సూచన చేశారు. అనంతరం పౌరసమాజంలో క్రియాశీల పాత్ర పోషించాలనే కుతూహలంతో ఉన్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమైన కొన్ని రోజులకే కాంగ్రెస్‌ దిగ్గజనేత నుంచి ఇటువంటి అభిప్రాయం వ్యక్తం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

‘సమాజంలో చాలా మార్పు తీసుకురావాలి. ఇందులో పౌరసమాజం పాత్ర ఎంతో కీలకం. కులం, మతం ఇతర అంశాల పేరుతో ప్రజల్లో విభజన తెచ్చేందుకు రాజకీయ పార్టీలన్నీ ప్రయత్నిస్తున్నాయి. ఇందుకు మా సొంత పార్టీ కాంగ్రెస్‌ కూడా మినహాయింపేమీ కాదు. దేశంలో రాజకీయాలు చాలా నీచంగా మారాయి. ఎంతగా అంటే.. ఒక్కోసారి మనం మనుషులమేనా అన్న అనుమానం కలుగుతోంది. అందుకే పౌరసమాజం అంతా ఐకమత్యంగా ఉండాలి’ అని జమ్మూలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆజాద్‌ పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తాను కూడా రాజకీయాల నుంచి తప్పుకొని.. సామాజిక సేవలో మరింత చురుగ్గా పాల్గొనాలనే కుతూహలంతో ఉన్నానని చెప్పారు. అందుకే ఏక్షణమైనా వచ్చి తాను రాజకీయాలను వీడుతున్నానని ప్రకటించినా ఆశ్చర్యం లేదంటూ వేదికపై ఉన్నవారికి ముందస్తు సూచన చేశారు.

కశ్మీరీ పండిట్‌లకు ఎదురైన అనుభవాలతో రూపొందించిన ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోన్న నేపథ్యంలో ఆదివారం జరిగిన సమావేశంలో మాట్లాడిన ఆజాద్‌.. కశ్మీర్‌ లోయలో చోటుచేసుకున్న అశాంతికి పాకిస్థాన్‌ ఉగ్రవాదమే ప్రధాన కారణమన్నారు. వారివల్ల కశ్మీర్‌ లోయలో హిందువులు, కశ్మీరీ పండిట్‌లు, ముస్లింలతోపాటు డోగ్రాస్‌ వర్గాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదిలాఉంటే.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ తన ప్రాభవాన్ని కోల్పోతున్న నేపథ్యంలో అందుకుగల కారణాలపై పార్టీ అధిష్ఠానాన్ని ప్రశ్నిస్తోన్న (జీ 23) నేతల్లో గులాంనబీ ఆజాద్‌ ఒకరు. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి అనంతరం పార్టీ సంస్థాగత మార్పుపై ఆజాద్‌ గళమెత్తారు. ఇందులో భాగంగా ఇటీవలే సోనియా గాంధీతోనూ నేరుగా సమావేశమయ్యారు. ఇలా కాంగ్రెస్‌ పార్టీలో వరుస పరిణామాలు చోటుచేసుకుంటున్న సమయంలోనే రాజకీయాల నుంచి వైదొలిగేందుకు సిద్ధంగా ఉన్నానంటూ ఆజాద్‌ హింట్‌ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని