Gyanvapi Case: మసీదు కమిటీ పిటిషన్‌ కొట్టివేసిన అలహాబాద్‌ హైకోర్టు

జ్ఞానవాపి మసీదు కేసులకు (Gyanvapi Case) సంబంధించి శృంగార గౌరీ ఆలయంలో నిత్యం పూజలు చేసుకోవడంపై కొందరు హిందూ మహిళలు స్థానిక కోర్టులో వేసిన పిటిషన్‌ను రద్దు చేయాలని ముస్లిం వర్గం వేసిన పిటిషన్‌ను అలహాబాద్‌ హైకోర్టు (Allahabad High Court) తిరస్కరించింది.

Published : 31 May 2023 18:33 IST

వారణాసి: జ్ఞానవాపి మసీదు కేసులకు (Gyanvapi Case) సంబంధించిన ఓ అంశంలో కమిటీకి చుక్కెదురయ్యింది. శృంగార గౌరీ ఆలయంలో నిత్యం పూజలు చేసుకోవడంపై కొందరు హిందూ మహిళలు స్థానిక కోర్టులో వేసిన పిటిషన్‌ను రద్దు చేయాలని ముస్లిం వర్గం వేసిన పిటిషన్‌ను అలహాబాద్‌ హైకోర్టు (Allahabad High Court) తిరస్కరించింది. వారణాసి జిల్లా కోర్టులో వారు వేసిన పిటిషన్‌పై విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది.

జ్ఞానవాపి మసీదు కాంప్లెక్సులో ఉన్న శృంగార గౌరీతో (Shringar Gauri) పాటు ఇతర ఆలయాల్లో నిత్యం పూజలు చేసుకునే హక్కు ఉందంటూ ఐదుగురు హిందూ మహిళలు స్థానిక కోర్టులో ఆగస్టు 2021లో సివిల్‌ సూట్‌ దాఖలు చేశారు. ఇది విచారణకు అర్హమైనదని వారణాసి జిల్లా కోర్టు సెప్టెంబర్‌ 2022లోనే పేర్కొంది. అయితే, దీనిని అంజుమన్‌ ఇంతెజామియా కమిటీ వ్యతిరేకించింది. ఇలా హిందూ మహిళలు వేసిన పిటిషన్‌ను రద్దు చేయాలని కోరుతూ అంజుమన్‌ ఇంతెజామియా కమిటీతోపాటు యూపీ సన్నీ వక్ఫ్‌బోర్డు అలహాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనికి సంబంధించిన వాదనలు 2022 డిసెంబర్‌ 23లో హైకోర్టులో ముగిశాయి. తీర్పును రిజర్వులో ఉంచిన అలహాబాద్‌ హైకోర్టు.. తాజాగా దానిని వెలువరించింది. జిల్లా కోర్టులో ఈ కేసు విచారణ కొనసాగించేందుకు అనుమతి ఇస్తూ తీర్పు ఇచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని