Influenza: ఫ్లూతో మరణాలు.. కర్ణాటక, హరియాణాలో ఇద్దరు మృతి..!

దేశంలో ఇటీవల వేగంగా వ్యాప్తి చెందుతోన్న ఇన్‌ఫ్లుయెంజా హెచ్‌3ఎన్‌2 (H3N2 Influenza Virus Cases) వైరస్‌ కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి.

Updated : 10 Mar 2023 12:57 IST

దిల్లీ: కరోనా మహమ్మారి నుంచి కోలుకుంటున్న వేళ.. దేశంలో ఇన్‌ఫ్లుయెంజా (Influenza) వైరస్‌ వ్యాప్తి కలవరపెడుతోంది. గత రెండు, మూడు నెలలుగా ఈ ఫ్లూ కేసులు విపరీతంగా పెరుగుతుండగా తాజాగా మరణాలు కూడా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ‘ఇన్‌ఫ్లుయెంజా ఏ (Influenza A)’ ఉప రకమైన ‘హెచ్‌3ఎన్‌2 (H3N2)’ అనే వైరస్‌ కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖకు చెందిన ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. హరియాణా, కర్ణాటకలో ఒక్కొక్కరు చొప్పున ఈ వైరస్‌ లక్షణాలతో మరణించినట్లు పేర్కొన్నాయి. (H3N2 Influenza Virus Cases)

అయితే, కర్ణాటకలో చోటుచేసుకున్న మరణాన్ని అధికారులు ధ్రువీకరించారు. హసన్‌ జిల్లాకు చెందిన 82 ఏళ్ల హీరే గౌడ హెచ్‌3ఎన్‌2 వైరస్‌ కారణంగా మార్చి 1న మృతిచెందినట్లు ఆ జిల్లా ఆరోగ్య అధికారి పీటీఐకి వెల్లడించారు. బాధితుడు ఫిబ్రవరి 24న ఆసుపత్రిలో చేరగా.. మార్చి 1న మరణించినట్లు తెలిపారు. అయితే, ఆయన శాంపిల్‌ను పరీక్ష చేయగా.. హెచ్‌3ఎన్‌2 వైరస్‌ నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. మృతుడు హీరే గౌడకు బీపీ, షుగర్‌ కూడా ఉన్నట్లు ఆరోగ్య అధికారి తెలిపారు. కాగా.. హరియాణాలో ఇన్‌ఫ్లుయెంజా మరణాన్ని మాత్రం ఇంకా ధ్రువీకరించలేదు.

ఇదీ చదవండి: ఫ్లూ లక్షణాలివే.. ఈ పనులు చేయొద్దు..!

కొవిడ్‌ (Covid) తరహా లక్షణాలున్న ఈ ఇన్‌ఫ్లుయెంజా కేసులు ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరుగుతున్నాయి. దీని కారణంగా అనేక మంది శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని, ఆసుపత్రిలో చేరికలకూ ఇది కారణమవుతోందని భారత వైద్య పరిశోధన మండలి, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఇటీవల వెల్లడించింది. అధికారిక గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 90కి పైగా హెచ్‌3ఎన్‌2 (H3N2 Influenza) కేసులు నమోదయ్యాయి. ఇన్‌ఫ్లుయెంజా (Influenza) మరో రకమైన హెచ్‌1ఎన్‌1 కేసులు కూడా నమోదైనట్లు సదరు వర్గాల సమాచారం.

జ్వరం, తీవ్రమైన దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, గొంతునొప్పి, అలసట ఈ వైరస్‌ ప్రధాన లక్షణాలు. ఈ వైరస్‌ కారణంగా వచ్చిన జ్వరం 5-7 రోజుల్లో పూర్తిగా తగ్గిపోతున్నప్పటికీ.. దగ్గు మాత్రం సుమారు మూడు వారాల వరకు ఉంటోంది. దీని కారణంగా ఆసుపత్రిలో చేరికలు తక్కువగానే ఉంటున్నప్పటికీ.. జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని