Sandeshkhali: ‘షాజహాన్‌ షేక్‌ను సాయంత్రం 4.15కల్లా సీబీఐకి అప్పగించాల్సిందే’.. హైకోర్టు ఆదేశం

ఈడీపై దాడి చేసిన కేసులో నిందితుడు షాజహాన్‌ షేక్‌ అప్పగింతపై కలకత్తా హైకోర్టు డెడ్‌లైన్‌ విధించింది.     

Updated : 06 Mar 2024 15:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సందేశ్‌ఖాలీలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులపై దాడి కేసులో నిందితుడు షాజహాన్‌ షేక్‌ విషయంలో పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వానికి చుక్కెదురైంది. అతడిని ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రం 4.15 కల్లా సీబీఐకి అప్పగించి తీరాల్సిందేనని కలకత్తా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సీఐడీపై కోర్టు ధిక్కారం నమోదు చేయాలని సీబీఐ కోరిన వేళ ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.

వాస్తవానికి ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు బాధ్యతలను కలకత్తా హైకోర్టు మంగళవారమే కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కానీ, పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం వీటిపై సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తాము తక్షణమే దీనిపై విచారణ జరపలేమని న్యాయస్థానం తేల్చిచెప్పింది. దీంతో కేంద్ర దర్యాప్తు సంస్థ బాధ్యతలు స్వీకరించి మంగళవారం సాయంత్రం నాటికి కేసు నమోదు చేసింది.  నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు సీబీఐ అధికారుల బృందం.. కోల్‌కతాలోని సీఐడీ ప్రధాన కార్యాలయానికి వెళ్లింది. అయితే షాజహాన్‌ అప్పగింతకు అక్కడి పోలీసులు నిరాకరించారు. రెండు గంటల పాటు వేచి చూసిన  సీబీఐ బృందం అక్కడి నుంచి ఖాళీ చేతులతో వెనుదిరగాల్సి వచ్చింది.

సందేశ్‌ఖాలీలో అకృత్యాలు.. ఎవరీ షాజహాన్‌ షేక్‌..?

సీబీఐ మరోసారి హైకోర్టును ఆశ్రయించింది. మంగళవారం నాటి ఆదేశాలపై సుప్రీం ఎటువంటి స్టే ఇవ్వలేదని.. అయినా రాష్ట్ర ప్రభుత్వం షాజహాన్‌ షేక్‌ను అప్పగించడం లేదని ఈడీ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వీ రాజు వాదించారు. ఈ విషయంలో ఏమాత్రం వేచి చూసినా.. హైకోర్టు ఆదేశాలు నీరుగారిపోతాయని పేర్కొన్నారు. మరోవైపు సీబీఐ న్యాయవాదులు కూడా కోర్టు ఆదేశాలను డీజీపీ, సీఎస్‌, అడిషనల్‌ డీజీ, సీఐడీకి పంపినట్లు తెలిపారు. అయితే సుప్రీం పరిధిలో విషయం ఉండటంతో కొంత సమయం వేచి చూడాలని వారు కోరినట్లు వెల్లడించారు. అత్యున్నత న్యాయస్థానం దీనిపై ఎలాంటి స్టే ఇవ్వలేదని చెప్పారు. దీంతో నేటి సాయంత్రానికి నిందితుడు షాజహాన్‌ షేక్‌ను అప్పగించి తీరాల్సిందేనని హైకోర్టు డెడ్‌లైన్‌ విధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని