Har Ghar Tiranga: అమితాబ్‌, ప్రభాస్‌, కోహ్లీ నోట.. ‘హర్‌ ఘర్‌ తిరంగా’ పాట..

దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు గడుస్తున్న తరుణంలో ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ (azadi ka amrit mahotsav)’ ఉత్సవాలను కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఇంటింటిపై

Published : 04 Aug 2022 15:07 IST

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ వేళ సెలెబ్రిటీల ‘ఇంటింటా జెండా’ గీతం

వైరల్‌ అవుతోన్న వీడియో

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు గడుస్తున్న తరుణంలో ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ (azadi ka amrit mahotsav)’ ఉత్సవాలను కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఇంటింటిపై మువ్వన్నెల జెండా ఎగురవేసేలా ‘హర్‌ ఘర్‌ తిరంగా (Har Ghar Tiranga)’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నెల 13 నుంచి 15 వరకు దేశంలోని ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ఇటీవల ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కార్యక్రమాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేంద్ర సాంస్కృతిక శాఖ ‘హర్‌ ఘర్‌ తిరంగా (Har Ghar Tiranga)’ ప్రత్యేక గీతాన్ని విడుదల చేసింది. ‘‘మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకొంటున్న సందర్భంగా మన ఐక్యత, గౌరవానికి చిహ్నంగా నిలిచిన మువ్వన్నెల జెండాకు ఈ మధురమైన వందనం’’ అంటూ కేంద్రం ఈ గీతాన్ని రూపొందించింది.

భారతీయ సంస్కృతి, సంప్రదాయలు ఉట్టిపడుతూ అణువణువునా దేశభక్తి చాటేలా రూపొందించిన ఈ గీతంలో సినీ, క్రీడా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ‘హర్‌ ఘర్‌ తిరంగా’ అంటూ తమ గళం కలిపారు. ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌, ప్రభాస్‌, అజయ్‌ దేవగణ్‌, అక్షయ్‌ కుమార్‌, జాకీ ష్రాఫ్‌, అనుపమ్ ఖేర్‌, వరుణ్‌ ధావన్‌, అనుష్క శర్మ, కీర్తి సురేశ్‌, సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్‌ పాటు క్రీడా ప్రముఖులు కపిల్‌ దేవ్‌, విరాట్ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్యా, నీరజ్‌ చోప్రా, పీవీ సింధు, మేరీ కోమ్‌, మీరాబాయి చాను, మిథాలీ రాజ్‌, పీటీ ఉష తదితరులు జెండా చేతబట్టి హర్‌ ఘర్‌ తిరంగా అంటూ పాడారు. అమితాబ్‌ హిందీలో పాడగా.. ప్రభాస్‌ ‘ఇంటింటా జెండా’ అంటూ తెలుగులో, కీర్తి సురేశ్ తమిళంలో గళం కలిపారు. చివర్లో ప్రధాని మోదీ చిన్నారులతో ఆనందంగా కరచాలనం చేస్తూ కన్పించారు.

మన దేశంలోని ప్రఖ్యాత కట్టడాలు, సందర్శక ప్రదేశాలతో పాటు స్వచ్ఛ భారత్‌, సౌర విద్యుత్తు, వ్యాక్సినేషన్‌, క్షిపణి ప్రయోగాలు, సైన్యం విజయాల వంటివి చూపించారు. ఈ గీతాన్ని ప్రముఖ గాయకులు సోను నిగమ్‌, ఆశా భోంస్లే ఆలపించారు. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందించినట్లు తెలుస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. సెలెబ్రిటీల ‘హర్‌ ఘర్‌ తిరంగా (Har Ghar Tiranga)’ గీతాన్ని మీరూ వినేయ్యండి..!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని