Harsh Goenka: ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు కిడ్నాప్‌ చేసి..కోహినూర్‌పై గోయెంకా ట్వీట్‌

కోహినూర్ వజ్రాన్ని బ్రిటన్‌ నుంచి వెనక్కి రప్పించే ఐడియా చెప్పారు ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా. దానిపై చమత్కారంగా ట్వీట్‌ చేశారు. 

Published : 27 Oct 2022 01:51 IST

ముంబయి: భారతీయ మూలాలున్న రిషి సునాక్‌ బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన దగ్గరినుంచి టీమిండియా మాజీ క్రికెటర్ ఆశిశ్‌ నెహ్రా ట్రెండింగ్‌లోకి వచ్చారు. నెటిజన్లు రిషి స్థానంలో ఆశిశ్‌ చిత్రాలను పోస్టు చేసి, మీమ్స్‌తో సందడి చేశారు. మరికొందరు ఏకంగా భారత్‌కు కోహినూర్ తెప్పించాలని నెహ్రాకు అభ్యర్థన కూడా పెట్టుకున్నారు. ఈ మీమ్స్‌ ఫెస్ట్ ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకాను కూడా ఆకట్టుకుంది. కోహినూర్‌ను వెనక్కి రప్పించేందుకు తన స్నేహితుడు ఐడియా ఇచ్చారంటూ తనదైన శైలిలో స్పందించారు. ట్విటర్‌లో యాక్షన్ ప్లాన్‌ను వివరించారు. 

* ముందుగా రిషి సునాక్‌ను భారత్‌కు రప్పించాలి.

* తన మామగారి(ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి) కుటుంబాన్ని చూసేందుకు వచ్చి, బెంగళూరు ట్రాఫిక్‌లో చిక్కుకున్నప్పుడు ఆయన్ను కిడ్నాప్‌ చేయాలి.

* అప్పుడు బ్రిటన్‌ ప్రధానిగా రిషి స్థానంలో ఆశిశ్‌ నెహ్రాను  పంపాలి. ఆ తేడా ఎవరూ గమనించలేరు.

* కోహినూర్‌ను వెనక్కి రప్పించే బిల్లును ఆమోదించమని నెహ్రాకు సూచించాలని హర్ష గోయెంకా ట్వీట్ చేశారు. అంతే.. వెంటనే ఆ వజ్రం భారత్‌కు చేరుకుంటుందని అర్థం వచ్చేలా ఎమోజీలను షేర్‌  చేశారు.

ఈ ఐడియాపై నెటిజన్లు అంతే చమత్కారంగా ట్వీట్లు చేశారు. ‘అయ్యో.. మీరు ప్లాన్‌ అంతా చెప్పేశారు సర్.. ఇంకో ప్లాన్ వేయాల్సిందే’, ‘ బెంగళూరు ట్రాఫిక్‌లో చిక్కుకున్న తర్వాత కిడ్నాప్‌ అవసరం లేదు. ఆయన అందులో నుంచి బయటపడేసరికి, మన మిషన్ పూర్తవుతుంది’, ‘ఇప్పుడు నెహ్రా బ్రిటిష్ ఇంగ్లీష్ ఎలా మాట్లాడతారు..?’ అంటూ కామెంట్లు పెట్టారు.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని