Corona: సెకండ్‌ వేవ్‌ ఇంకా ముగిసిపోలేదు..!

దేశంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి కాస్త అదుపులోకి రావడంతో రాష్ట్రాలన్ని కొవిడ్‌ ఆంక్షలను సడలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ముప్పు ఇంకా ముగిసిపోలేదని కేంద్ర ఆరోగ్యశాఖ మరోసారి అప్రమత్తం చేసింది.

Published : 29 Jun 2021 15:50 IST

అప్రమత్తంగా ఉండాలన్న కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి కాస్త అదుపులోకి రావడంతో పలు రాష్ట్రాలు కొవిడ్‌ ఆంక్షలను సడలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ముప్పు ఇంకా ముగిసిపోలేదని కేంద్ర ఆరోగ్యశాఖ మరోసారి అప్రమత్తం చేసింది. కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికీ కొవిడ్‌ నిబంధనలు పాటించడంలో నిర్లక్ష్యం చేయవద్దని స్పష్టం చేసింది.

‘కరోనా సెకండ్‌ వేవ్‌ ఇంకా ముగిసిపోలేదు. కేసుల సంఖ్య గణనీయంగా తగ్గినప్పటికీ.. ఎలాంటి పరిస్థితుల్లోనూ విశ్రమించకూడదు. కరోనాపై ఒకటిన్నరేళ్లుగా మనకున్న అనుభవం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఈ సమయంలో మనం మరింత అప్రమత్తంగా ఉండాలి’ అని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ పేర్కొన్నారు. కొవిడ్‌ విజృంభణపై దిల్లీ ఎల్‌జీ అనిల్‌ బైజల్‌, ఆరోగ్యశాఖమంత్రి సత్యేంద్ర జైన్‌లతో ఏర్పాటు చేసిన వర్చువల్‌ సమావేశంలో కేంద్రమంత్రి మాట్లాడారు. అదృష్టవశాత్తు ఆరు నెలలుగా వ్యాక్సిన్‌ కూడా అందుబాటులో ఉందని.. ఈ సమయంలో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల త్వరలోనే మహమ్మారిమీద విజయం సాధించవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇక దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24గంటల్లో 37వేల పాజిటివ్‌ కేసులు నమోదుకాగా మరో 907 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు 3కోట్ల 3లక్షల మందిలో వైరస్‌ బయటపడగా.. వీరిలో 3లక్షల 97వేల మంది మృత్యువాతపడ్డారు. మరోవైపు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. నిత్యం 50లక్షలకుపైగా డోసులను పంపిణీ చేస్తున్నారు. ఇప్పటివరకు దేశంలో 33కోట్ల వ్యాక్సిన్‌ డోసులను అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని