భారత్‌లో రెండు వ్యాక్సిన్లూ సురక్షితమైనవే..!

దేశంలో అందుబాటులోకి వచ్చిన రెండు వ్యాక్సిన్లూ సురక్షితమైనవేనని కేంద్ర ఆరోగ్యశాఖ మరోసారి స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలో కరోన తీవ్రత అదుపులోనే ఉందని.. ఈ సమయంలో కొవిడ్‌ నిబంధనలు పాటించడంలో ప్రజలు నిర్లక్ష్యం చేయకూడదని హెచ్చరించింది.

Published : 30 Mar 2021 14:21 IST

మరోసారి స్పష్టం చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ

దిల్లీ: దేశంలో అందుబాటులోకి వచ్చిన రెండు వ్యాక్సిన్లూ సురక్షితమైనవేనని కేంద్ర ఆరోగ్యశాఖ మరోసారి స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలో కరోన తీవ్రత అదుపులోనే ఉందని.. ఈ సమయంలో కొవిడ్‌ నిబంధనలు పాటించడంలో ప్రజలు నిర్లక్ష్యం చేయకూడదని హెచ్చరించింది. కొవిడ్‌ టీకాలపై ఇప్పటికీ ప్రజల్లో సందేహాలున్నాయని..సామాజిక మాధ్యమాల్లో వచ్చే అసత్య వార్తలను ప్రజలు నమ్మవద్దని సూచించింది.

‘దేశవ్యాప్తంగా చాలా మంది ప్రజలకు వ్యాక్సిన్లపై ఇంకా సందేహాలున్నాయి. కానీ, ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన కొవిషీల్డ్‌, కొవాగ్జిన్ టీకాలు అత్యంత సురక్షితమైనవి, పూర్తి సమర్థవంతమైనవి. వాట్సాప్‌తో పాటు సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్న అలాంటి అసత్య వార్తలను నమ్మవద్దు’ అని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ స్పష్టంచేశారు. దిల్లీలోని ఓ ఆసుపత్రిలో కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి హర్షవర్ధన్‌ దంపతులు కొవిడ్‌ రెండో డోసు తీసుకున్నారు. ఈ సందర్భంలో తొలి డోసు తీసుకున్న అనంతరం తమకు ఎటువంటి ఇబ్బందులు కలుగలేదని పేర్కొన్నారు.

టీకా తీసుకున్నాక పాజిటివ్ వస్తే..?

వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కరోనా పాజిటివ్‌ వస్తున్నట్లు అరుదైన కేసులను గుర్తించాం. ఇలా పాజిటివ్‌ వచ్చినప్పటికీ వ్యాక్సిన్‌ తీసుకున్న కారణంగా వారిలో తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు తక్కువ. ఆసుపత్రిలో చేరేంత తీవ్రత నుంచి బయటపడడంలో వ్యాక్సిన్‌ దోహదపడుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో కొవిడ్‌ తీవ్రత అదుపులోనే ఉందన్న ఆయన, కొవిడ్‌ నిబంధనలు పాటించడంలో ప్రజలు నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు.

ప్రయోగాల్లో ఏడు వ్యాక్సిన్లు..

ప్రస్తుతం దేశంలో ఏడు కరోనా వ్యాక్సిన్లు క్లినికల్‌ ట్రయల్స్‌ దశలో ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి వెల్లడించారు. వాటిలో కొన్ని తుదిదశకు చేరుకోగా మరో 20కిపైగా వ్యాక్సిన్‌లు ప్రీ-క్లినికల్‌ దశలో ఉన్నాయని తెలిపారు. ఇక ఇప్పటికే ప్రయోగాలు పూర్తి చేసుకున్న స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌కు మరికొన్ని రోజుల్లోనే అనుమతి వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే, దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 6కోట్ల 11లక్షల కొవిడ్‌ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటిలో 5కోట్ల 22లక్షల మంది తొలిడోసు తీసుకోగా, వీరిలో 89లక్షల మందికి రెండు డోసులను అందించారు. అత్యధికంగా మహారాష్ట్ర, రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో 50లక్షల చొప్పున కొవిడ్‌ డోసుల పంపిణీ పూర్తయ్యింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని