
Haryana: రైతుల తలలు పగలకొట్టాలని ఆదేశించింది ఆయనే..!
చండీగఢ్: ‘ఏ ఒక్కరూ రావడానికి వీల్లేదు. ఏది ఏమైనా వాళ్లను రానిచ్చేది లేదు. మీ లాఠీలు తీసుకోండి. వారిని చితక్కొట్టండి. ఇంకా ఎటువంటి సూచనలు మీకు అవసరం లేదు. నేను ఇక్కడ ఒక్క నిరసనకారుడిని చూసినా.. అతడి తల పగిలిపోవాలి. వారందరి తలలు పగలకొట్టండి’ అంటూ రైతులపై పోలీసులను ఉసిగొల్పాడు ఓ ఉన్నతాధికారి. నిన్న హరియాణాలోని కర్నల్‌లో సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన రైతులపై జరిగిన లాఠీఛార్జ్ వల్ల 10 మంది రైతుల రక్తం చిందిన విషయం తెలిసిందే. దీనికి ప్రధాన కారణమైన ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. ఇందులో కర్నల్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఆయుష్ సిన్హా పోలీసులకు ఆదేశాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
దీనిపై హరియాణా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతులా స్పందించారు. ‘రైతుల తలలు పగలకొట్టాలని పోలీసులకు ఆ అధికారి ఆదేశాలు చేస్తున్నట్లుగా ఈ వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. ఆయన చట్టపరంగా చర్యలు ఎదుర్కొవాల్సి వస్తోంది’ అని దుష్యంత్ వెల్లడించారు.
‘2018 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయుష్ సిన్హా పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన వీడియో వైరల్ అయింది. దీనికి సమాధానంగా రెండు రోజులు సరిగా నిద్రపోలేదని.. అందుకే రైతులు చేస్తున్న ఆందోళనకు అసహనం కోల్పోయానని చెప్పారు. కానీ, రైతులు 365 రోజులు నిద్రపోలేదని ఆయన తెలుసుకోవాలి. అతనిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటాం’ అని ఆయన తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.