Chandigarh: నాడు పంజాబ్‌, నేడు హరియాణా.. చండీగఢ్‌పై ఏకగ్రీవ తీర్మానం

హరియాణా కీలక నిర్ణయం తీసుకుంది. చండీగఢ్​ను ఉమ్మడి రాజధానిగా యథాతథంగా కొనసాగించాలని రాష్ట్ర అసెంబ్లీ మంగళవారం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.......

Published : 06 Apr 2022 02:15 IST

చండీగఢ్‌: కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్‌పై మరింత వివాదం రాజుకుంటోంది. పంజాబ్‌, హరియాణాల ఉమ్మడి రాజధాని అయిన చండీగఢ్‌ను తమకు బదిలీ చేయాలని పంజాబ్ అసెంబ్లీ​ తీర్మానించిన నేపథ్యంలో హరియాణా సైతం కీలక నిర్ణయం తీసుకుంది. చండీగఢ్​ను ఉమ్మడి రాజధానిగా యథాతథంగా కొనసాగించాలని హరియాణా అసెంబ్లీ మంగళవారం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఈ తీర్మానానికి పలు విపక్ష పార్టీలు మద్దతు తెలుపగా.. ముఖ్యమంత్రి మనోహర్​ లాల్​ ఖట్టర్ ఆ పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు.

పంజాబ్​ తీసుకున్న నిర్ణయం సరైనది కాదని.. ఇది హరియాణా ప్రజలకు ఆమోదయోగ్యం కాదని సీఎం పేర్కొన్నారు. మూడు గంటల పాటు ఈ చర్చలు కొనసాగాయి. ఈ తీర్మానంతో పాటు సట్లెజ్​- యమునా నదుల నిర్మాణం, హిందీ మాట్లాడే రాష్ట్రాల జాబితాలో హరియాణాను చేర్చే అంశాలపై చర్చించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. చండీగఢ్​పై పంజాబ్​ తీర్మానం నేపథ్యంలో హరియాణా అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది.

చండీగఢ్‌ కేంద్రపాలిత ఉద్యోగులకు సెంట్రల్‌ సర్వీస్‌ నిబంధనలు వర్తిస్తాయంటూ గత ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రకటించారు. అయితే షా ప్రకటన పట్ల ఆప్‌, కాంగ్రెస్‌, అకాలీదళ్‌ నేతల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. హోంమంత్రి ప్రకటన పంజాబ్‌ హక్కులను హరించేలా ఉందని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్‌ను తక్షణమే పూర్తిగా తమకు కేటాయించాలని పంజాబ్‌ అసెంబ్లీ ఈనెల 1వ తేదీన తీర్మానం చేసింది. ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ దీన్ని ప్రవేశపెట్టగా.. భాజపా మినహా అన్ని పార్టీల సభ్యులు దీనికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని