Rahul Gandhi: ‘హేట్‌ ఇన్‌ ఇండియా- మేక్‌ ఇన్‌ ఇండియా’ మనుగడ అసాధ్యం..!

దేశం నుంచి పలు అంతర్జాతీయ వాహన తయారీ సంస్థలు నిష్క్రమిస్తున్నాయని.. అందుకు కేంద్ర ప్రభుత్వ తీరే కారణమంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మండిపడ్డారు.

Published : 27 Apr 2022 16:39 IST

నిరుద్యోగం విషయంలో ప్రభుత్వతీరుపై మండిపడ్డ రాహుల్‌ గాంధీ

దిల్లీ: దేశం నుంచి పలు అంతర్జాతీయ వాహన తయారీ సంస్థలు నిష్క్రమిస్తున్నాయని.. అందుకు కేంద్ర ప్రభుత్వ తీరే కారణమంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. దేశంలో హేట్‌ ఇన్‌ ఇండియా, మేక్‌ ఇన్‌ ఇండియా ఒకేసారి మనుగడ సాగించలేవని విమర్శించారు. ఇటీవల కాలంలో పలు వాహన తయారీ సంస్థలు తమ ఉత్పత్తి కేంద్రాలను నిలిపివేయడంతో వేల మంది నిరుద్యోగులుగా మారుతున్నారని రాహుల్‌ గాంధీ గుర్తుచేశారు. ఈ సందర్భంగా దేశంలో అత్యంత దారుణంగా మారుతోన్న నిరుద్యోగ సంక్షోభంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టిపెట్టాలని సూచించారు.

‘సులభతర డ్రైవింగ్‌ వ్యాపారం భారత్‌ నుంచి వెళ్లిపోతోంది. 7 అంతర్జాతీయ బ్రాండ్లు, 9 ఫ్యాక్టరీలు, 649 డీలర్‌షిప్‌లు, 84వేల ఉద్యోగాలు పోయాయ్‌. హేట్‌-ఇన్‌-ఇండియా, మేక్‌-ఇన్‌-ఇండియా రెండూ ఒకేసారి మనుగడ సాగించలేవు. వీటికి బదులుగా అత్యంత దారుణంగా మారుతోన్న నిరుద్యోగ సంక్షోభంపై దృష్టిపెట్టండి’ అని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేస్తూ రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా ఏయే సంవత్సరంలో ఏయే కంపెనీలు భారత్‌ నుంచి నిష్క్రమించాయో తెలుపుతూ ఓ చార్ట్‌ను పోస్ట్‌ చేశారు. 2017లో షెవర్లే, 2018లో మ్యాన్‌ ట్రక్స్‌, 2019లో ఫియట్‌, యునైటెడ్‌ మోటార్స్‌, 2020లో హార్లీ డేవిడ్సన్‌, 2021లో ఫోర్డ్‌, 2022లో డట్సన్‌ వంటి విదేశీ కంపెనీలు భారత్‌లో ఉత్పత్తిని నిలిపివేశాయని రాహుల్‌ గాంధీ గుర్తుచేశారు.

ఇంటింటా నిరుద్యోగం..

దేశంలో నెలకొన్న నిరుద్యోగంపై దృష్టి సారించడం లేదంటూ కేంద్ర ప్రభుత్వంపై రాహుల్‌గాంధీ మరోసారి మండిపడ్డారు. ముఖ్యంగా మోదీ ప్రభుత్వం ఇస్తోన్న మాస్టర్‌స్ట్రోక్‌లతో దేశంలో కోట్ల మంది నిరుద్యోగులు తమ ఆశలను కోల్పోవాల్సిన పరిస్థితి తలెత్తిందని దుయ్యబట్టారు. ఇంటింటా నిరుద్యోగమే ఇప్పటి నినాదమన్న ఆయన.. గత ఐదేళ్లలో రెండుకోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారంటూ మీడియాలో వచ్చిన కథనాలను ఉదహరిస్తూ కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని