Election Commission: పార్టీల రిజిస్ట్రేషన్ రద్దు చేసే అధికారం మాకివ్వండి: ఈసీ

రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్​ను రద్దు చేసే అధికారం తమకు ఇవ్వాలని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖను కేంద్ర ఎన్నికల సంఘం కోరింది.......

Published : 27 Jun 2022 01:37 IST

దిల్లీ: రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్​ను రద్దు చేసే అధికారం తమకు ఇవ్వాలని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖను కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) కోరింది. నమోదు చేసే అధికారాన్ని ఎన్నికల సంఘానికి ఇచ్చినప్పుడు రద్దు చేసే అధికారాన్ని కూడా ఇవ్వాలని అభిప్రాయపడింది. ఎన్నికల సంఘానికి ఈ అధికారాన్ని ఇస్తే అక్రమాలకు పాల్పడే రాజకీయ పార్టీలను నిరోధించవచ్చని పేర్కొంది.

ఆదాయ పన్ను నుంచి మినహాయింపు పొందేందుకే కొందరు రాజకీయ పార్టీలను (political parties) నమోదు చేసుకుంటున్నారని ఈసీ పేర్కొంది. అందుకే అనేక పార్టీలు ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేసుకుంటున్నాయి కానీ ఎన్నికల్లో పోటీ చేయడంలేదని గుర్తు చేసింది. రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్‌ రద్దు చేసే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చేటట్లు ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించాలని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖను ఎన్నికల సంఘం కోరింది. ప్రస్తుతం దేశంలో 8 జాతీయ పార్టీలు, 50కి పైగా ప్రాంతీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘం వద్ద గుర్తింపు పొందాయి. 2,800 పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేసుకున్నాయి.

అడ్రస్‌లేని 198 గుర్తింపులేని నమోదిత రాజకీయ పార్టీలను (రిజిష్టర్డ్‌ అన్‌రికగ్నైజ్డ్‌ పొలిటికల్‌ పార్టీస్‌) రద్దుచేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం కొద్దిరోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. ఏదైనా రాజకీయ పార్టీగా నమోదు చేసుకున్న సంస్థకు తపాలా చిరునామా తప్పనిసరి. అందులో మార్పులు ఉంటే తప్పనిసరిగా ఆ విషయాన్ని ఎన్నికల సంఘానికి తెలియజేయాల్సి ఉంటుంది. అయితే చాలా రాజకీయ పార్టీలకు తాము పంపిన వర్తమానాలు అవి పేర్కొన్న చిరునామాలకు చేరడం లేదని గుర్తించిన ఎన్నికల సంఘం వాటి గురించి సంబంధిత రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారులతో విచారణ జరిపించింది. వారు సమర్పించిన నివేదికలు, ఎన్నికల సంఘం పంపిన లేఖలు ఆయా పార్టీలకు చేరకపోవడం గురించి పోస్టల్‌ యంత్రాంగం చెప్పిన వివరాలను ఆధారంగా ఆ పార్టీలను రద్దుచేస్తున్నట్లు ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని