Supreme Court: ముందే తెలుసుకొని వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారా?: సుప్రీంకోర్టు విస్మయం

రాజీవ్‌ కుమార్‌ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియమితులైన తర్వాత ఖాళీ అయిన ఎన్నికల కమిషనర్‌ పదవికి అరుణ్‌ గోయెల్‌ ఎంపిక, దీనికి సంబంధించిన దస్త్రాలు శరవేగంగా కదిలిన తీరుపై సుప్రీంకోర్టు  విస్మయం వ్యక్తం చేసింది.

Updated : 03 Mar 2023 07:33 IST

ఎన్నికల కమిషనర్‌గా అరుణ్‌ గోయెల్‌ నియామక తీరుపై..

దిల్లీ: రాజీవ్‌ కుమార్‌ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియమితులైన తర్వాత ఖాళీ అయిన ఎన్నికల కమిషనర్‌ పదవికి అరుణ్‌ గోయెల్‌ ఎంపిక, దీనికి సంబంధించిన దస్త్రాలు శరవేగంగా కదిలిన తీరుపై సుప్రీంకోర్టు  విస్మయం వ్యక్తం చేసింది. ఎన్నికల కమిషనర్‌గా నియమితులు కానున్నానని అరుణ్‌ గోయెల్‌కు ముందే తెలియకపోతే భారీ పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్న ఆయన స్వచ్ఛంద పదవీ విరమణకు ఎలా దరఖాస్తు చేసుకున్నారని ప్రశ్నించింది. 2022 డిసెంబరు 31న పదవీ విరమణ చెందాల్సిన గోయెల్‌ అదే ఏడాది నవంబరు 18న స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. ఆ వెంటనే కేంద్రం ఆయనను ఎన్నికల కమిషనర్‌గా నియమించింది. న్యాయశాఖ రూపొందించిన నలుగురు సభ్యుల పేర్లతో కూడిన జాబితా నుంచి గోయెల్‌ పేరును ప్రధానికి, రాష్ట్రపతికి సిఫార్సు చేయడం, అదేరోజు మెరుపు వేగంతో ఆమోదం పొందడం ఓ మాయగా ఉందని ధర్మాసనం పేర్కొంది. ఎన్నికల కమిషన్‌ సభ్యుల నియామకానికి కొలీజియం తరహా కమిటీ ఉండాలని, అందులో ప్రధాని, లోక్‌సభలో విపక్ష నేత, సీజేఐ సభ్యులుగా ఉండాలని గురువారం తీర్పునిచ్చిన ధర్మాసనం...ప్రస్తుతం జరుగుతున్న నియామకాల తీరును దుయ్యబట్టింది. ఎన్నికల కమిషనర్‌గా గోయెల్‌ నియామక విషయాన్ని తీర్పులో ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఎన్నికల కమిషన్‌లో సభ్యులు గొప్ప విద్యావంతులు అయినంత మాత్రాన సరిపోదని, ఉన్నత విలువలను కలిగి ఉండడానికి, స్వతంత్రంగా, నిష్పాక్షికంగా, రాజకీయ అనుబంధాలకతీతంగా వ్యవహరించగలగడానికి అది ప్రత్యామ్నాయం కాబోదని స్పష్టం చేసింది. చట్టబద్ధంగా నడుచుకోవడం ఎన్నికల సంఘం ప్రధాన బాధ్యతని తెలిపింది. జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌ నేతృత్వంలోని ఈ ధర్మాసనంలో జస్టిస్‌ అజయ్‌రస్తోగి, జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్‌ హృషికేష్‌రాయ్‌, జస్టిస్‌ సి.టి.రవికుమార్‌ సభ్యులుగా ఉన్నారు. న్యాయ శాఖ రూపొందించిన జాబితాలోని నలుగురు సభ్యుల్లో ఎవరూ ఎన్నికల సంఘంలో నిర్దేశిత ఆరేళ్ల పదవీ కాలాన్ని పూర్తిచేయలేరని, అటువంటి పరిస్థితిలో వారి పేర్లను ప్రధానికి ఎలా సిఫార్సు చేశారని ధర్మాసనం ప్రశ్నించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని