High court: ఒక్క కుటుంబం 4-5 కార్లు కొనడానికి అనుమతించొద్దు!

రోజురోజుకీ దేశవ్యాప్తంగా వ్యక్తిగత వాహనాల సంఖ్య పెరిగిపోతోంది. దీంతో రోడ్లపై, నివాస ప్రాంతాల్లో పార్కింగ్‌ సమస్య తలెత్తుతోంది. ఒక్కో ఇంటికి 4-5 వాహనాలుంటుండడంతో వాటిని నిలిపి ఉంచడానికి నగరాల్లో స్థలం లేకుండా పోతోంది....

Published : 13 Aug 2021 22:37 IST

పార్కింగ్‌ స్థలం అంశంపై బాంబే హైకోర్టు

ముంబయి: రోజురోజుకీ దేశవ్యాప్తంగా వ్యక్తిగత వాహనాల సంఖ్య పెరిగిపోతోంది. దీంతో రోడ్లపై, నివాస ప్రాంతాల్లో పార్కింగ్‌ సమస్య తలెత్తుతోంది. ఒక్కో ఇంటికి 4-5 వాహనాలుండటంతో వాటిని నిలిపి ఉంచడానికి నగరాల్లో స్థలం లేకుండా పోతోంది. ఇక ముంబయి వంటి మహానగరాల పరిస్థితి గురించి చెప్పక్కర్లేదు. ఈ అంశంపై బాంబే హైకోర్టు శుక్రవారం తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కారు పార్కింగ్‌ స్థలాన్ని తగ్గించేందుకు డెవలపర్లకు అనుమతించింది. ఈ మేరకు ‘యునిఫైడ్‌ డెవలప్‌మెంట్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రమోషన్‌ రెగ్యులేషన్ల’లో మార్పులు చేస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీన్ని సవాల్‌ చేస్తూ సందీప్‌ ఠాకూర్‌ అనే సామాజిక కార్యకర్త హైకోర్టును ఆశ్రయించారు. సరిపడా పార్కింగ్ స్థలం లేకపోవడం వల్ల వాహనదారులు తమ కార్లను రోడ్లపైనే నిలిపి ఉంచుతున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన కోర్టు ఒక ఫ్లాట్‌ ఉన్నవారు.. 4-5 వాహనాలు కొనేందుకు అనుమతించొద్దని స్పష్టం చేసింది. ‘‘కొత్త వాహనాల కొనుగోళ్లను తగ్గించాల్సిన అవసరం ఉంది. కొనే స్తోమత ఉన్నంత మాత్రాన ఒక్క కుటుంబం 4-5 వాహనాలు కొనుగోలు చేసేందుకు అనుమతించొద్దు. పార్కింగ్‌కు సరిపడా స్థలం ఉందో.. లేదో.. తనిఖీ చేయాల్సిన అవసరం ఉంది’’ అని జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్ జి.ఎస్‌.కులకర్ణిలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

పార్కింగ్‌ విషయంలో సరైన విధానం రూపొందించకపోతే.. గందరగోళ పరిస్థితులు తలెత్తుతాయని కోర్టు అభిప్రాయపడింది. రోడ్లన్నీ వాహనాలతో నిండిపోతున్నాయని తెలిపింది. దాదాపు 30 శాతం రోడ్డు.. వాహనాల పార్కింగ్‌కే పోతోంది. ఇది సర్వసాధారణమైన విషయంగా మారింది. ఈ విషయంలో ప్రజా సమస్యల్ని పరిష్కరించేందుకు ఓ సమగ్ర విధానంతో ముందుకు రావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని