Sunita Kejriwal: ‘ఆ వీడియో తొలగించండి’: సునీతా కేజ్రీవాల్‌కు దిల్లీ కోర్టు నోటీసులు

సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియో విషయంలో సునీతా కేజ్రీవాల్‌ (Sunita Kejriwal)కు దిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది. 

Updated : 15 Jun 2024 14:08 IST

దిల్లీ: ఆప్‌ అధినేత, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్‌ (Sunita Kejriwal)కు దిల్లీ కోర్టు నోటీసులు జారీచేసింది. మార్చి 28న అరవింద్ కేజ్రీవాల్ కోర్టులో మాట్లాడుతున్న దృశ్యాలు/ఆడియో రికార్డులను ఆమె తన సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించాలని ఆదేశించింది. అలాగే అవి ఎక్కడున్నా తీసివేయాలంటూ ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ వంటి సోషల్ మీడియా వేదికలకు ఆదేశాలు ఇచ్చింది.

దిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టయిన సంగతి తెలిసిందే. ఆ కేసు విచారణలో భాగంగా మార్చి 28న ఆయన వ్యక్తిగతంగా హాజరై స్వయంగా వాదనలు వినిపించారు. ఆప్‌ను ఒక అవినీతి పార్టీగా చిత్రీకరించేందుకు యత్నిస్తున్నారని ఆ సందర్భంగా ఆరోపించారు. ఆ వాదనకు సంబంధించిన ఆడియో/వీడియోను ఆప్‌తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు సోషల్‌ మీడియాలో పోస్టు చేశాయంటూ ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అలా విచారణలను రికార్డు చేయడం ‘హైకోర్టు ఆఫ్ దిల్లీ రూల్స్‌ ఫర్ వీడియో కాన్ఫరెన్సింగ్‌ ఫర్ కోర్ట్స్‌(2021)’ నిబంధనల ప్రకారం నిషిద్ధమంటూ ఆ పిటిషనర్ వాదించారు. వీటిని వైరల్‌ చేయడం ద్వారా న్యాయవ్యవస్థ, న్యాయమూర్తుల ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకు యత్నించారని వెల్లడించారు. ఇదంతా ఆప్‌, అరవింద్ కేజ్రీవాల్ కుట్రలో భాగమని ఆరోపించారు. ఈ నిబంధనలు ఉల్లంఘించినందుకు చర్యలు తీసుకోవాలంటూ కోరారు. ఒక ‘ఎక్స్’ యూజర్ అప్‌లోడ్ చేసిన ఆడియో రికార్డింగ్‌ను సునీత కూడా తన సోషల్‌ మీడియా ఖాతాల్లో రీపోస్టు చేశారు.

ఈ నేపథ్యంలో సదరు పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. వాటిని తొలగించాలంటూ సునీతతో పాటు సోషల్ మీడియా సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. తన అరెస్టును సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దానిపై విచారణ ఆలస్యమవుతుండటంతో ఎన్నికల్లో ప్రచారం కోసం చేసిన అభ్యర్థనను అంగీకరిస్తూ.. కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు జూన్‌ 2న తిరిగి జైలు అధికారుల ముందు లొంగిపోయారు. ప్రస్తుతం ఆయన తిహాడ్‌ జైల్లో ఉన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు