Navneet Rana: నవనీత్‌ రాణా దంపతులకు దక్కని ఊరట.. పిటిషన్‌ను కొట్టివేసిన న్యాయస్థానం..!

హనుమాన్‌ చాలీసా పారాయణ వివాదంలో అరెస్టయిన మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గ స్వతంత్ర ఎంపీ నవనీత్‌ రాణా దంపతులకు మరో షాక్‌ తగిలింది. ఈ వివాదంలో తమపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను

Published : 26 Apr 2022 01:32 IST

ముంబయి: హనుమాన్‌ చాలీసా పారాయణ వివాదంలో అరెస్టయిన మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గ స్వతంత్ర ఎంపీ నవనీత్‌ రాణా దంపతులకు మరో షాక్‌ తగిలింది. ఈ వివాదంలో తమపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలంటూ రాణా దంపతులు దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది.

ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ఠాక్రే ఇంటి ముందు హనుమాన్‌ చాలీసా పఠించి తీరతామంటూ నవనీత్‌ రాణా, ఆమె భర్త రవి రాణా సవాలు విసిరారు. ఈ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ శివసేన పార్టీ కార్యకర్తలు ఎంపీ ఇంటిముందు భారీ ఎత్తున నిరసన ప్రదర్శనకు దిగారు. ఈ క్రమంలోనే రెండు వర్గాల మధ్య మత కలహాలు చెలరేగేలా వ్యాఖ్యలు చేశారంటూ రాణా దంపతులపై ముంబయి పోలీసులు ఏప్రిల్‌ 23న రాజద్రోహం కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులను రాణా దంపతులు అడ్డుకున్నారు. దీంతో పోలీసు అధికారులపై దాడి చేశారన్న ఆరోపణలపై ఏప్రిల్‌ 24న రెండో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

కాగా.. ఈ రెండో ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలంటూ రాణా దంపతులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై నేడు విచారణ జరిపి ఉన్నత న్యాయస్థానం.. ఈ పిటిషన్‌కు ఎలాంటి అర్హత లేదంటూ కొట్టివేసింది. అయితే రెండో ఎఫ్‌ఐఆర్‌లో రాణా దంపతులపై చర్యలు చేపట్టాలనుకుంటే వారికి 72 గంటల ముందు నోటీసులివ్వాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మరోవైపు రాజద్రోహం అభియోగాలపై గత శనివారం రాణా దంపతులను అరెస్టు చేసిన పోలీసులు.. వారిని ఆదివారం కోర్టులో హాజరుపర్చారు. వీరికి రెండు వారాల జ్యుడీషియల్‌ కస్టడీ విధిస్తూ బాంద్రా మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ ఆదేశాలు జారీ చేశారు. దీంతో నవనీత్‌ను బైకుల్లా మహిళా జైలుకు, రవి రాణాను ఆర్థర్‌ రోడ్డు జైలుకు తరలించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని