AAP vs LG: ఆప్‌కు చుక్కెదురు ..ఆ వీడియోలు, ట్వీట్‌లు తొలగించండి..!

దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (LG) వినయ్‌ కుమార్‌ సక్సేనాపై ఆమ్‌ఆద్మీ పార్టీ (AAP) చేస్తోన్న ఆరోపణలను వెంటనే ఆపాలని దిల్లీ హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీచేసింది.

Updated : 27 Sep 2022 17:44 IST

లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు దిల్లీ హైకోర్టులో ఊరట

దిల్లీ: దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (LG) వినయ్‌ కుమార్‌ సక్సేనాపై ఆమ్‌ఆద్మీ పార్టీ (AAP) చేస్తోన్న ఆరోపణలను వెంటనే ఆపాలని దిల్లీ హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీచేసింది. అంతేకాకుండా ఎల్‌జీపై అవినీతి ఆరోపణలకు సంబంధించి ఇప్పటివరకు సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టులు, వీడియోలు, ట్వీట్లను కూడా వెంటనే తొలగించాలని స్పష్టం చేసింది. రూ.1400 కోట్ల కుంభకోణంలో దిల్లీ ఎల్జీకి భాగస్వామ్యం ఉందంటూ ఆప్‌ చేస్తోన్న ఆరోపణలపై దిల్లీ హైకోర్టు ఈ విధంగా స్పందించింది.

ఆమ్‌ఆద్మీకి చెందిన ఐదుగురు నేతలు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఎల్‌జీ వీకే సక్సేనా దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై చేస్తోన్న ఆరోపణలకు సంబంధించిన వీడియోలు, ట్వీట్లను తొలగించడంతోపాటు తన పరువుకు భంగం కలిగినందున రూ.2.5కోట్ల పరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని తన దావాలో పేర్కొన్నారు. గతంలో నమోదైన కేసులో సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం కేవలం రూ.17లక్షలకు సంబంధించిన వ్యవహారమని ఉండగా.. ఆప్‌ నేతలు మాత్రం ఊహాజనిత లెక్కలతో రూ.1400కోట్లు అని చెబుతున్నారని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై ఇరు పక్షాల వాదనలు విన్న జస్టిస్‌ అమిత్‌ బన్సాల్‌.. ఈ వ్యవహారంలో ఎల్‌జీపై ఆప్‌ నేతలు ఆరోపణలు ఆపాలని సూచించారు. ఇప్పటివరకు సోషల్‌ మీడియాలో చేసిన పోస్టులు, వీడియోలు, ట్వీట్‌లను తొలగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

2016 నవంబరు నోట్ల రద్దు సమయంలో ఖాదీ మరియు విలేజ్‌ ఇండస్ట్రీస్‌ కమిషన్‌ (కేవీఐసీ) ఛైర్మన్‌ బాధ్యతల్లో ఉన్న సక్సేనా.. అక్రమంగా నగదు తరలించారని ఆమ్‌ఆద్మీ ఆరోపిస్తోంది. అది దాదాపు రూ.1400కోట్ల కుంభకోణమని.. అందులో ఆయన పాత్ర కూడా ఉందని విమర్శిస్తోంది. అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా సక్సేనా కూతురుకి ఓ కాంట్రాక్ట్‌ అప్పజెప్పారని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆరోపిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని