Haryana: ప్రైవేటు ఉద్యోగాల్లో 75శాతం రిజర్వేషన్‌కు బ్రేక్‌..!

ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికులకు 75శాతం రిజర్వేషన్‌ కల్పించేలా హరియాణా ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన చట్టానికి తాత్కాలికంగా బ్రేక్‌ పడింది.

Published : 03 Feb 2022 15:37 IST

హరియాణా ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు

దిల్లీ: ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికులకు 75శాతం రిజర్వేషన్‌ కల్పించేలా హరియాణా ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన చట్టానికి తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. ప్రస్తుతం ఆ నిర్ణయాన్ని ప్రస్తుతానికి నిలుపుదల చేస్తున్నట్లు పంజాబ్‌, హరియాణా ఉమ్మడి హైకోర్టు వెల్లడించింది. అంతేకాకుండా దీనిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరింది. స్థానికులకు 75శాతం కోటాపై హరియాణా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఫరీదాబాద్‌ ఇండస్ట్రీస్‌ అసోసియేషన్‌తో పాటు పలువురు దాఖలు చేసిన పిటిషన్‌లను విచారించిన న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, హైకోర్టు నిర్ణయంపై హరియాణా డిప్యూటీ ముఖ్యమంత్రి దుష్యంత్‌ చౌతాలా స్పందించారు. రాష్ట్ర యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ప్రైవేటు రంగం ఉద్యోగాల్లో స్థానికులకే 75 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ ప్రభుత్వం గతేడాది నూతన చట్టాన్ని తీసుకువచ్చింది. అయితే, దీనిపై ప్రైవేటు రంగం, పారిశ్రామికవేత్తల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం పారిశ్రామిక రంగానికి తీవ్ర నష్టం కలిగించడంతోపాటు పెట్టుబడులపైనా తీవ్ర ప్రభావం చూపిస్తుందని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా హైకోర్టు నిర్ణయం ప్రైవేటు రంగ సంస్థలకు ఊరట కలిగినట్లయ్యింది.

నిరుద్యోగంలో హరియాణా టాప్‌..

కొవిడ్‌ కారణంగా ఏర్పడ్డ ప్రతికూల పరిస్థితులతో దేశంలో నిరుద్యోగిత విపరీతంగా పెరిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే, ప్రస్తుతం కొవిడ్‌ తీవ్రత తగ్గుముఖం పట్టడంతో దేశంలో నిరుద్యోగిత రేటు కాస్త తగ్గుముఖం పడుతోందని సెంటర్‌ ఫర్‌ మానీటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (CMIE) పేర్కొంది. ప్రస్తుతం దేశంలో నిరుద్యోగిత రేటు 6.57శాతంగా నమోదైనట్లు తెలిపింది. వీటిలో అత్యధిక నిరుద్యోగిత రేటు 23.4శాతం హరియాణాలో ఉండగా.. రాజస్థాన్‌లో 18.9శాతం ఉందని తెలిపింది. అత్యల్ప నిరుద్యోగం రేటు తెలంగాణలో 0.7శాతంగా నమోదుకాగా.. గుజరాత్‌ (1.2శాతం), మేఘాలయ (1.5శాతం), ఒడిశా (1.8శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు