Afghanistan: తాలిబన్ల దాష్టీకం.. అఫ్గాన్‌ ఉన్నతాధికారి దారుణ హత్య

అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు మరోమారు దాష్టీకానికి పాల్పడ్డారు. అక్కడి ప్రభుత్వ మీడియా, సమాచార శాఖకు చెందిన ఉన్నతాధికారి అయిన దవాఖాన్‌ మీనాపాల్‌ను హతమార్చారు.

Published : 06 Aug 2021 18:55 IST

కాబూల్‌: అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు మరోమారు దాష్టీకానికి పాల్పడ్డారు. అక్కడి ప్రభుత్వ మీడియా, సమాచార శాఖకు చెందిన ఉన్నతాధికారి అయిన దవాఖాన్‌ మీనాపాల్‌ను హతమార్చారు. దేశ రాజధాని నగరం కాబూల్‌లో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రార్థానా మందిరంలో అతడిని కాల్చి చంపారు. తమపై జరుగుతున్న రాకెట్‌ దాడులకు ప్రతీకారంగా దాడులు చేస్తామన్న తాలిబన్ల హెచ్చరికల అనంతరం ఈ దారుణం జరగడం గమనార్హం.

దవాఖాన్‌ మృతిని అఫ్గాన్‌ ప్రభుత్వం సైతం ధ్రువీకరించింది. అఫ్గాన్‌కు చెందిన ప్రముఖ అధికారిని దారుణంగా తాలిబన్లు హతమార్చారని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. తాలిబన్లు సైతం ఇది తమ పనేనని ప్రకటించారు. అమెరికా భద్రతా బలగాలు వెనక్కి వెళ్లిన నాటి నుంచి తాలిబన్లు దారుణాలు పెచ్చుమీరాయి. అఫ్గాన్‌లోని కీలక ప్రాంతాలు ఇప్పటికే వారి వశమయ్యాయి. మరోవైపు తాలిబన్లు మంగళవారం జరిపిన బాంబు దాడి నుంచి రక్షణ మంత్రి త్రుటిలో తప్పించుకోగా.. ఇదే తరహాలో అఫ్గాన్‌ ప్రభుత్వ నేతలే లక్ష్యంగా మరిన్ని దాడులు ఉంటాయని తాలిబన్లు ఇది వరకే ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని