Corona: పిల్లల్లో మళ్లీ కొవిడ్‌ కలకలం.. వైద్యరంగ నిపుణులేమంటున్నారంటే?

దేశంలో పాఠశాలలు పునఃప్రారంభమయ్యాక దిల్లీ, నోయిడా వంటి పలు నగరాల్లో పిల్లల్లో మరోసారి కరోనా కేసులు వెలుగుచూస్తున్న వేళ నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు.......

Published : 17 Apr 2022 02:16 IST

దిల్లీ: దేశంలో పాఠశాలలు పునఃప్రారంభమయ్యాక ఇటీవలి కాలంలో దిల్లీ, నోయిడా వంటి పలు నగరాల్లోని పిల్లల్లో మరోసారి కొవిడ్‌ కేసులు రావడం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యలో పలువురు వైద్యరంగ నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు. పిల్లల్లో కరోనా వస్తున్నప్పటికీ లక్షణాలు స్వల్పంగానే ఉంటున్నాయనీ.. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. అర్హులైన పిల్లలంతా తక్షణమే వ్యాక్సిన్‌ వేయించుకోవాలంటున్నారు. మాస్క్‌ ధరించడం, శానిటైజర్‌ వాడకం, తరచూ చేతుల్ని శుభ్రపరచుకోవడం వంటి కొవిడ్‌ మార్గదర్శకాల్ని పిల్లలు, ఉపాధ్యాయులు స్థిరంగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

భయపడాల్సిన అవసరంలేదు.. రణ్‌దీప్‌ గులేరియా

పిల్లల్లో కరోనా వచ్చినా ఆ ప్రభావం స్వల్పంగానే ఉంటోందనీ.. లక్షణాలకు తగిన చికిత్సతోనే కోలుకొంటున్నట్టు గతంలో వచ్చిన కొవిడ్‌ దశల డేటాయే స్పష్టంగా చెబుతోందని దిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా తెలిపారు. అందువల్ల ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. వ్యాక్సినేషన్‌కు అర్హులైన పిల్లలు టీకాలు తీసుకోవాలని సూచించారు. అయితే, ఇప్పటికీ ఇంకా టీకాలు వేయించుకోని వారు కూడా భయపడాల్సిన అవసరంలేదనీ.. వారికి తీవ్రమైన ఇన్ఫెక్షన్‌ వచ్చే అవకాశం లేదని వ్యాఖ్యానించారు.

పిల్లల్లో లక్షణాలు స్వల్పమే: చంద్రకాంత్‌ లహరియా

పాఠశాలలు పునఃప్రారంభమయ్యాక పిల్లలు కరోనా బారినపడుతున్న వార్తల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని   ఫిజీషియన్‌ ఎపిడిమియోలజిస్ట్‌ డాక్టర్‌ చంద్రకాంత్‌ లహరియా అన్నారు. పాఠశాలలు మూసివేసిన సమయంలో దాదాపు 70 నుంచి 90శాతం మంది పిల్లలు ఇన్ఫెక్షన్‌ బారిన పడినట్టు వేర్వేరు సీరోప్రెవెలెన్స్‌ సర్వేల ద్వారా తెలుస్తోందని చెప్పారు. పెద్దల్లో లాగే చిన్నారుల్లోనూ కరోనా సోకినప్పటికీ వారిలో లక్షణాలు స్వల్పమేనన్నారు. కొత్త వేరియంట్లు వచ్చినా పిల్లలపై చూపించిన ప్రభావం స్వల్పంగానే ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కొన్ని పాఠశాలల్లోని కొందరు చిన్నారులకు పాజిటివ్‌ వస్తోందన్న వార్తలతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి: సమీరన్‌ పాండే

కొవిడ్‌ వ్యాప్తికి పాఠశాలలు వాహకాలుగా లేనట్టు అంతర్జాతీయంగా వస్తున్న ఆధారాలు సూచిస్తున్నాయని ఐసీఎంఆర్‌ అదనపు డీజీ సమీరన్‌ పాండా అన్నారు. మాస్కులు ధరించడం, శానిటైజర్లు వాడకం,  చేతులు శుభ్రం చేసుకోవడం వంటి ప్రామాణికమైన ప్రొటోకాల్‌ని విద్యార్థులు, ఉపాధ్యాయులు పాటించాలన్నారు. ఐదేళ్లలోపు పిల్లలకు మాస్క్‌లు సిఫారసు చేయనప్పటికీ, ఆరు నుంచి 11 ఏళ్ల వయసు వారు మాత్రం తమ వినియోగ సామర్థ్యాన్ని బట్టి మాస్క్‌ ధరించవచ్చని తెలిపారు. 12ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసు కలిగిన వారు మాత్రం పెద్దల మాదిరిగానే మాస్క్‌లు వినియోగించుకోవాలని పాండా సూచించారు. పాఠశాలల్లో తగిన వెలుతురు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలనీ, ఎయిర్‌ కండిషన్‌ వాడకానికి దూరంగా ఉండాలన్నారు. కరోనా సోకే ప్రమాదం లేకుండా తరగతి గదుల్లో ఎగ్జాస్ట్‌ ఫ్యాన్‌లను అమర్చాలని సూచించారు. పిల్లలంతా కలిసి ఒకేచోట కలిసి భోజనం చేయకుండా చూడటంతో పాటు క్యాంటీన్లు/డైనింగ్‌ హాళ్లలో ఎక్కువసేపు సేపు గడపకూడదని సూచించాలన్నారు.

పిల్లలకు టీకాలు వేయించండి: నమీత్‌ జెరాత్‌

అర్హులైన చిన్నారులంతా తక్షణమే టీకాలు వేయించుకొనేలా తల్లిదండ్రులు చూడాలని ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రుల సీనియర్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ ‌నమీత్‌ జెరాత్‌ సూచించారు. కొవిడ్‌కు వ్యతిరేకంగా రోగ నిరోధకతను పెంచుకోవడంలో టీకాలే ఎంతో కీలకమన్నారు. కొవిడ్‌ ఇన్ఫెక్షన్‌ సోకిన పిల్లలు టీకా వేయించుకొనేందుకు కనీసం మూడు నెలల కాలం పాటు వేచి ఉండాలన్న విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలన్నారు. పిల్లలకు ఏవైనా ఎలర్జిటిక్‌ సంబంధించి చికిత్స తీసుకుంటుంటే మాత్రం కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలన్నారు. వ్యాక్సినేషన్‌ అనంతరం పిల్లలకు స్వల్ప జ్వరం, చేతినొప్పి వంటివి రావొచ్చనీ.. ఆ సమయంలో కేవలం అవసరమైతేనే పారాసిటమాల్‌ వాడాలన్నారు. వ్యాక్సినేషన్‌కు ముందు పిల్లలకు పారాసిటమాల్‌ ఎట్టిపరిస్థితుల్లో ఇవ్వొద్దని డాక్టర్‌ జెరాత్‌ సూచించారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని