Covid Vaccines: టీకాల సేకరణపై కేంద్రం కీలక నిర్ణయం.. రూ.4237కోట్లు వెనక్కి

కొవిడ్‌ టీకాల సేకరణను కొంతకాలం నిలిపివేసి.. అందుకు కేటాయించిన బడ్జెట్లో రూ.4237 కోట్లను సరెండర్‌ చేసేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ నిర్ణయించింది.

Updated : 16 Oct 2022 20:39 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో కరోనా వ్యాక్సినేషన్‌ (Corona Vaccine) ప్రక్రియ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఇటువంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్‌ టీకాల సేకరణను కొంతకాలం నిలిపివేసేందుకు సిద్ధమయ్యింది. అందుకు కేటాయించిన బడ్జెట్‌ను ఆర్థికశాఖకు సరెండర్‌ చేసేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ నిర్ణయించినట్లు సమాచారం. 2022-23 బడ్జెట్‌లో వ్యాక్సినేషన్‌ కోసం చేసిన కేటాయింపులో ఇది 85శాతం కావడం గమనార్హం.

మూడో డోసు (Precaution Dose) వ్యాక్సిన్‌ పంపిణీ కొనసాగుతున్నప్పటికీ ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వద్ద సుమారు 1.8కోట్ల డోసులు అందుబాటులో ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. మరో ఆరు నెలల పాటు వ్యాక్సినేషన్‌ను కొనసాగించేందుకు ఇవి సరిపోతాయని అంచనా. ఒకవేళ ప్రభుత్వం దగ్గర ఉన్న నిల్వలు నిండుకుపోయినా.. మార్కెట్లో వీటి లభ్యత ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కొవిడ్‌ టీకాల డోసులను సేకరించాలా..? వద్దా? అనే విషయంపై ఆరు నెలల తర్వాతే నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

జనవరి 16, 2021న దేశవ్యాప్తంగా మొదలుపెట్టిన కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో అర్హులందరికీ కేంద్ర ప్రభుత్వం ఉచితంగానే టీకాలు అందిస్తోంది. ఇప్పటివరకు 219 కోట్ల డోసులను పంపిణీ చేశారు. దేశ వ్యాప్తంగా అర్హుల్లో 98శాతం మంది కనీసం ఒక డోసు తీసుకోగా.. 92శాతం రెండు డోసులు తీసుకున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది వ్యాక్సిన్‌ పంపిణీకి 2022-23 బడ్జెట్‌లో రూ.5వేల కోట్లు కేటాయించింది. ప్రస్తుతం మూడో డోసు పంపిణీ చేస్తున్నప్పటికీ కొవిడ్‌ ప్రాబల్యం తగ్గడంతో టీకా తీసుకునేందుకు లబ్ధిదారులు అంతగా ఆసక్తి చూపడం లేదు. దీంతో సేకరించిన టీకాల వినియోగ గడువుతో అవి వృథా అయ్యే ప్రమాదం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది వాటి కోసం కేటాయించిన బడ్జెట్‌లో రూ.4237 కోట్లను ఆర్థిక శాఖకు అప్పగించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని