Covid Surge: మళ్లీ పంజా విసురుతోన్న కరోనా.. 5 రాష్ట్రాలకు కేంద్రం అలెర్ట్‌

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ మళ్లీ మొదలైనట్లు కనిపిస్తోంది. గత కొన్నిరోజులుగా రోజువారీ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.

Published : 03 Jun 2022 19:32 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ మళ్లీ మొదలైనట్లు కనిపిస్తోంది. గత కొన్నిరోజులుగా రోజువారీ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దేశంలో కరోనా క్రియాశీల కేసుల సంఖ్య 21వేలు దాటింది. ముఖ్యంగా తమిళనాడు, కేరళ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో స్థానికంగా కొవిడ్‌ కేసులు ఆందోళనకర రీతిలో పెరుగుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గుర్తించింది. దీంతో కొవిడ్‌ కట్టడికి ముమ్మర చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర ఆరోగ్యశాఖ ఐదు రాష్ట్రాలకు లేఖ రాసింది.

‘కరోనా వైరస్‌పై చేస్తోన్న పోరులో ఇప్పటివరకూ వచ్చిన ఫలితాలను కోల్పోకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా ప్రజారోగ్యం విషయంలో ముప్పు అంచనా ఆధారిత విధానాన్ని పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ క్రమంలో టెస్టుల సంఖ్య పెంచడం, జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేపట్టడాన్ని ముమ్మరంగా చేయాలి. వైరస్‌ వ్యాప్తి తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సమర్థంగా కట్టడి చర్యలు చేపట్టాలి’ అని ఐదు రాష్ట్రాలకు రాసిన లేఖలో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ పేర్కొన్నారు. ఈ సమిష్టి కృషిలో అవసరమైన మద్దతును కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ తనవంతు సహాయాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

ఇదిలాఉంటే, గత వారంరోజులుగా దేశంలో పలు చోట్ల కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా మొత్తం 4041 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దాదాపు మూడు నెలల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా పాజిటివిటీ రేటు కూడా ఒక శాతానికి చేరువయ్యింది. కేవలం మహారాష్ట్ర, కేరళలోనే వెయ్యి చొప్పున కేసులు వెలుగు చూశాయి. ముంబయిలో కొవిడ్‌ పాజిటివిటీ రేటు ఆందోళనకర స్థాయిలో ఉన్న నేపథ్యంలో ప్రజలు కొవిడ్‌ నిబంధనలు పాటించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఇప్పటికే స్పష్టం చేశారు. లేదంటే మళ్లీ ఆంక్షలు విధించాల్సి రావచ్చని పరోక్ష హెచ్చరిక చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని