ఫిబ్రవరి 13నుంచి వ్యాక్సిన్‌ రెండో డోసు

ఫిబ్రవరి 13నుంచి ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్‌ రెండో డోసును అందించనున్నట్లు నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ వెల్లడించారు. గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ మేరకు తెలిపారు.

Published : 04 Feb 2021 20:20 IST

దేశంలో 21శాతం ప్రజల్లో యాంటీబాడీలు
వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ

దిల్లీ: ఫిబ్రవరి 13నుంచి ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్‌ రెండో డోసును అందించనున్నట్లు నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ వెల్లడించారు. గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ మేరకు తెలిపారు. కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ మాట్లాడుతూ..దేశంలో గురువారం మధ్యాహ్నం 1.30 వరకూ 45,93,427 మందికి వ్యాక్సిన్‌ అందించామన్నారు. ప్రస్తుతం క్రియాశీల కేసులు 1.60లక్షలు ఉన్నాయని తెలిపారు. మొత్తంగా ఇప్పటి వరకూ 19.9 కోట్ల కరోనా టెస్టులు నిర్వహించగా 1.07 కోట్ల కరోనా కేసులు నమోదయ్యాయన్నారు. కరోనా మరణాలు 1.54 లక్షలుగా ఉన్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల్లో  70శాతం కేరళ, మహారాష్ట్రల నుంచే నమోదవుతున్నాయని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో కేసుల్లో పెరుగుదల నమోదవుతుంది కానీ భారత్‌లో అటువంటి పరిస్థితులు లేవన్నారు. అత్యంత వేగంగా 4మిలియన్ల వ్యాక్సినేషన్‌ మార్క్‌ను మనం చేరుకున్నామని తెలిపారు.

వ్యాక్సిన్‌ తీసుకున్నవారిలో 97శాతం మంది వ్యాక్సిన్‌ పంపిణీపై సంతృప్తిని వ్యక్తం చేశారని తెలిపారు. ప్రస్తుతం దేశంలో 5,912 ప్రభుత్వ ఆస్పత్రులు, 1,239 ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా వ్యాక్సినేషన్‌ను నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో ఆ సంఖ్యను పెంచుతామని ఆయన తెలిపారు. అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో 73.6శాతం ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్‌ను అందించారు. తరువాతి స్థానాల్లో రాజస్థాన్‌(66.8శాతం), త్రిపుర (65.5శాతం) ఉన్నాయి. 11 రాష్ట్రాల్లో 30శాతం కన్నా తక్కువ మందికి వ్యాక్సిన్‌ను అందించారు. మొత్తంగా దేశంలో 45శాతం వైద్య సిబ్బందికి వ్యాక్సిన్లను అందించినట్లు రాజేశ్‌ భూషణ్‌ తెలిపారు.
దేశంలో 21శాతం ప్రజల్లో యాంటీబాడీలు..
ఐసీఎంఆర్‌ డైరక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ బలరామ్‌ భార్గవ్‌ మాట్లాడుతూ.. దేశంలోని 21శాతం ప్రజల్లో కరోనా యాంటీబాడీలు గుర్తించామని తెలిపారు. ‘‘దేశవ్యాప్తంగా 28,589 ప్రజలు, 7,171 మంది ఆరోగ్య సిబ్బందిని ఎంచుకొని సెరోలాజికల్‌ సర్వే చేశాం. 21 రాష్ట్రాల్లోని, 70జిల్లాల్లో, 700 గ్రామాల్లో ఈ సర్వేను నిర్వహించాం. జిల్లాకు 100 ఆరోగ్య సిబ్బందిని పరీక్షించాం.’’ అని ఆయన వెల్లడించారు. వ్యాక్సిన్లు తీసుకున్నా కానీ మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాంటించడం కొనసాగించాలన్నారు.

నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్ మాట్లాడుతూ.. వ్యాక్సిన్లలో ఒక్కటి కూడా వృధా కాలేదన్నారు. వాటిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ప్రతి వ్యాక్సిన్‌ తయారైన తేదీలు, ఎక్స్‌పైరీ తేదీలపై స్పష్టత ఉందన్నారు. సెరోలాజికల్‌ సర్వే నిర్వహించిన ఐసీఎంఆర్‌ సిబ్బందిని అభినందిస్తున్నామన్నారు. అరవై ఏళ్లు పైబడిన వారికి త్వరలో వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.

ఇవీ చదవండి..

296 మొబైల్‌ యాప్స్‌ నిషేధించాం

ఎవరి ట్వీట్లతోనో భారత్‌ బలహీనం కాదు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని