
PharmEasy: ఐపీవోకు సిద్ధమవుతున్న ఫార్మ్ఈజీ
ఇంటర్నెట్‌డెస్క్: పేటీఎం తర్వాత మరో యూనికార్న్ స్టార్టప్ ఐపీవోకు సిద్ధమైంది. ఫార్మా సేవల సంస్థ ఫార్మ్ఈజీ ఐపీవోకు వచ్చేందుకు వీలుగా డీఆర్‌హెచ్‌పీ (డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్) ఫైల్ చేసింది. ఈ ఐపీవోలో రూ.6,250 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకొన్నట్లు సమాచారం. ఈ ఆఫర్లో కంపెనీ షేర్లను విక్రయిస్తారేగానీ.. ఇప్పటికే ఉన్న ఇన్వెస్టర్లు మాత్రం తమ వాటాలను విక్రయించరు. తాజాగా ఐపీవోకు వచ్చిన టెక్ యూనికార్న్‌ల్లో ఇన్వెస్టర్ల వాటాలను విక్రయించని సంస్థ ఫార్మ్ఈజీ ఒక్కటే.
ఈ కంపెనీ రూ.1,250 కోట్ల నిధుల సేకరణకు ప్రైవేట్ ప్లేస్మెంట్ యాగ్రిగేటింగ్ విధానం కూడా అనుసరించాలని భావిస్తోంది. అదే జరిగితే ఐపీవో సైజు కొంత కుదించవచ్చు. అక్టోబర్‌లో కంపెనీ విలువ 5.4 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టారు. 2020 ఆర్థిక సంవత్సరంలో రూ.668 కోట్ల ఆదాయం లభించగా.. అదే 2021 నాటికి 250శాతం పెరిగి రూ.2,335 కోట్లకు చేరింది. ఈ ఏడాది జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి గాను రూ.1,197 కోట్లు ఆదాయం లభించగా.. రూ.306 కోట్ల నష్టం వచ్చింది. ఫార్మ్ఈజీ మాతృసంస్థ ఏపీఐ హోల్డింగ్స్ ఇటీవలే థైరోకేర్ టెక్నాలజీస్‌లో 66.1శాతం వాటాను కొనుగోలు చేసింది. రెడ్‌సీర్ రిపోర్టు ప్రకారం భారత్‌లో అతిపెద్ద ఆన్లైన్ ఫార్మా సంస్థగా ఐపీఐ హోల్డింగ్స్ నిలిచింది.