గుండెపోటుకు వజ్ర చికిత్స!

ఆభరణాలకు వన్నె, విలువ తెచ్చే వజ్రాలు... మనిషి ప్రాణాలనూ కాపాడతాయన్నది చాలామందికి తెలియకపోవచ్చు.

Published : 25 Dec 2020 14:09 IST

సురక్షితంగా రక్తనాళాల నుంచి కాల్షియం గడ్డల తొలగింపు
ఆసక్తి రేకెత్తిస్తున్న సూరత్‌ వైద్యం 

సూరత్‌: ఆభరణాలకు వన్నె, విలువ తెచ్చే వజ్రాలు... మనిషి ప్రాణాలనూ కాపాడతాయన్నది చాలామందికి తెలియకపోవచ్చు. కానీ, ఇది నిజం! ప్రపంచ వ్యాప్తంగా ఆభరణాల తయారీ రంగంలో సూరత్‌ వజ్రాలకు మంచి డిమాండ్‌ ఉంది. వైద్యంలోనూ ఈ డైమండ్లకు గిరాకీ తక్కువేం కాదు!
రక్తనాళాల్లో కాల్షియం గడ్డలుగా పేరుకుపోవడం వల్ల రక్త ప్రసరణ నిలిచిపోతుంది. దీంతో గుండె పోటు తలెత్తుతుంది. ఇలాంటి ప్రతి వంద కేసుల్లో నాలుగు కేవలం హృద్ధమనుల్లో కాల్షియం గడ్డ కట్టడం వల్లే వస్తున్నాయి. అయితే- సూరత్‌కు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్‌ డా.అతుల్‌ అభ్యాంకర్‌ ఈ సమస్యను చాలా సులభంగా  తొలగిస్తుంటారు.
రోటాబ్లాటర్‌ అనే బుల్లి డ్రిల్‌ యంత్రానికి సూరత్‌ వజ్రాన్ని అమర్చి, రక్తనాళంలోకి పంపుతారు. అక్కడి కాల్షియం గడ్డలను ఈ యంత్రం సాయంతో అత్యంత లాఘవంగా పిండి చేసేస్తారు! హృద్రోగులు చాలామంది అతుల్‌ వద్ద వజ్ర వైద్యం పొందడానికి ఆసక్తి చూపుతుంటారు. సాధారణంగా హృద్ధమనుల్లో కాల్షియం అధికంగా పేరుకుపోయినప్పుడు శస్త్రచికిత్స ద్వారా బెలూన్‌ను అమర్చుతారు. అయితే కాల్షియం అధిక స్థాయిలో పేరుకుపోయినా, నాళంపై ఒత్తిడి పెరిగినా కాస్త ఇబ్బంది తప్పదు. ఇలాంటి సందర్భాల్లో అభ్యాంకర్‌ రోటాబ్లాటర్‌ను ఉపయోగించి కాల్షియంను తొలగిస్తుంటారు.
రాయిని రాయితోనే తీయాలని...
‘‘అత్యంత దృఢమైన రాళ్లలో డైమండ్‌ ఒకటి.  ముల్లును ముల్లుతోనే తియ్యాలన్నది తెలుసు కదా. అందుకే... గుండెతో అనుసంధానమైన రక్తనాళాల్లో రాయిలా పేరుకుపోయిన కాల్షియం గడ్డలను వజ్రాన్ని ఉపయోగించి తొలగిస్తుంటాం. ఇందుకోసం రోటాబ్లాటర్‌ యంత్రానికి వజ్రాన్ని అమర్చుతాం. ఈ విధానంలో రక్తనాళాలను శుభ్రం చేయడానికి అదనంగా రూ.50 వేలు ఖర్చవుతుంది.
ఎలా పనిచేస్తుందంటే...
రోటాబ్లాటర్‌ యంత్రం 500 ఓల్టు విద్యుత్‌తో నడుస్తుంది. దీని మెడభాగంలో అమర్చిన వజ్రం నిమిషానికి 1.60 లక్షల నుంచి 1.80 లక్షల సార్లు గిర్రున తిరుగుతుంది. తద్వారా రక్తనాళాల్లో గడ్డలా పేరుకుపోయిన కాల్షియం 5 మైక్రాన్ల మందంతో కూడిన పొడిగా మారిపోతుంది. తర్వాత ఆ పొడి రక్త ప్రవాహంలో సహజంగానే కొట్టుకుపోతుంది. ఈ విధానం ఎంతో సురక్షితమైనది’’ అని అతుల్‌ అభ్యాంకర్‌ ‘ఈటీవీ భారత్‌’కు తెలిపారు. వజ్రం సాయంతో రక్తనాళాలను శుభ్రపరిచే ఈ విధానాన్ని తెలుసుకునేందుకు ఇరాన్‌ వైద్య బృందం ప్రత్యేకంగా సూరత్‌కు రావడం గమనార్హం.  

 ఇవీ చదవండి...
మన టీకాపై ప్రపంచ దేశాల దృష్టి!

భారత్‌లోనూ కొత్త వైరస్‌ వచ్చి ఉండొచ్చు
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని