Zerodha CEO: ఈ సీఈఓ ‘గుండు’ వెనుక కన్నీళ్లు పెట్టించే కథ..

వాళ్లిద్దరు ఇష్టపడ్డారు. పెద్దల ఆమోదంతో ఒక్కటయ్యారు. ఆమె తోడ్పాడు అందించింది. ఆయన వ్యాపారంలో రాణించాడు. ఓ కంపెనీ స్థాపించి అంచెలంచెలుగా ఎదిగాడు. ఇలా ఆనందంగా సాగిపోతోన్న

Published : 09 Mar 2022 01:18 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. పెద్దల ఆమోదంతో ఒక్కటయ్యారు. ఆనందంగా సాగిపోతోన్న వారి జీవితంలో అనుకోని కుదుపు. తను ఎంతగానో ప్రేమిస్తున్న తన భార్య క్యాన్సర్‌ బారిన పడిందనే చేదు వార్త..! కానీ, ఆయన కుంగిపోలేదు. అడుగడుగునా భార్యకు అండగా నిలిచాడు. క్యాన్సర్‌తో చేస్తోన్న పోరాటంలో ఆమె జుట్టంతా ఊడిపోతే.. సతీమణిలో మనోధైర్యం నింపేందుకు తాను కూడా గుండు చేయించుకుని ఆమె మీదున్న ప్రేమను చాటుకున్నాడు. ఆయనే జిరోదా కంపెనీ సీఈఓ నితిన్‌ కామత్‌. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నితిన్‌ తన భార్యకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పగా, ప్రతి దశలోనూ తనకు అండగా నిలిచిన భర్త గురించి సీమ పంచుకున్న విశేషాలు..!

‘‘నా పేరు సీమ. నేను ఎంతో ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంటాను అనుకునేదాన్ని. కానీ అది నిజం కాదని 2021 నవంబరులోనే తెలిసింది. అప్పుడే నాకు రొమ్ము క్యాన్సర్‌ అనే విషయం బయటపడింది. స్టేజ్ 2లో ఉన్నాను. ట్రీట్మెంట్‌లతో గత కొన్ని నెలలు నా జీవితంలో అత్యంత కఠినంగా, ఉద్వేగభరితంగా గడిచాయి. ఇప్పటివరకు నాకు క్యాన్సర్‌ అనే విషయం మా కుటుంబానికి, దగ్గరి స్నేహితులకు తప్ప ఎవరికీ తెలియదు. కానీ క్యాన్సర్‌ కూడా ఒక మానసిక సమస్య లాంటిదే. దానిపై అవగాహన లేకపోతే కుంగుబాటుకు గురవుతున్నారు. అందుకే నా కథను పంచుకోవాలనుకుంటున్నా’’

‘‘గత కొన్నేళ్లుగా నేను తరచూ హెల్త్‌ చెకప్‌లు చేయించుకుంటూ ఉన్నాను. ఒకసారి అలా చెకప్‌కు వెళ్లినప్పుడు నా కుడి రొమ్ములో చిన్న గడ్డ ఉందని వైద్యులు గుర్తించారు. నాకైతే ఎలాంటి నొప్పి వంటి లక్షణాలు కన్పించలేదు. కానీ ఎందుకైనా మంచిదని ఆంకాలజిస్ట్‌ దగ్గరకు వెళ్లి బయాప్సీ చేయించుకున్నా. అప్పుడే నాకు రొమ్ము క్యాన్సర్‌ అని నిర్ధారణ అయ్యింది. అయితే రెండో దశలోనే ఉండటంతో చికిత్సతో నయమవుతుందని డాక్టర్లు చెప్పారు. ఆ సమయంలో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అంతా గందరగోళం. నితిన్‌ని కూడా అదే పరిస్థితి. కానీ, మేం కుంగిపోలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్యులను సంప్రదించాం. సూచనలు తీసుకున్నాం. వీలైనంత తొందరగా ట్రీట్మెంట్‌ తీసుకోవడం మొదలుపెట్టా’’

‘‘ఈ నాలుగు నెలల్లో నన్ను చాలా తీవ్రంగా కలచివేసిన మరో అంశం సర్జరీ. క్యాన్సర్‌ కణతిని తొలగించేందుకు చేసిన శస్త్రచికిత్సలో నా కుడి రొమ్మును తొలగించాల్సి వచ్చింది. అయితే ఆ సమయంలో నా శరీరంలో క్యాన్సర్‌ ఉన్న విషయం కంటే నా అందం గురించిన ఆందోళన తక్కువే అనిపించింది. ఇక క్యాన్సర్‌ కణాలు రొమ్ము వెలుపలకు కూడా వ్యాపించాయని డాక్టర్లు చెప్పారు. దీంతో కీమో థెరపీకి వెళ్లక తప్పలేదు. నాలుగు కీమో సెషన్లు చేయించుకోవాలని చెప్పారు. అయితే కీమో వల్ల జుట్టు ఊడిపోతుందని వైద్యులు ముందే చెప్పారు. జుట్టు ఊడకుండా ఉండేందుకు నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఎందుకంటే జుట్టు లేకుండా నన్ను నేను ఊహించుకోలేను. కానీ అవేవీ ఫలించలేదు. మొదటి కీమో తర్వాత చాలా జుట్టు ఊడిపోయింది’’

‘‘ఇక మరో దారిలేక గుండు చేయించుకోవాలని నిర్ణయించుకున్నా. అప్పుడే నాకు నితిన్‌ కూడా అండగా నిలిచాడు. నాతో పాటే తను కూడా గుండు చేయించుకున్నాడు. మళ్లీ నాకు జుట్టు తిరిగొచ్చేవరకు తను గుండులోనే ఉంటానని చెప్పాడు. నితిన్‌ నిర్ణయం నాలో ఎంతో మనోస్థైర్యాన్ని నింపింది. నేను త్వరగానే కోలుకుంటానన్న నమ్మకం ఏర్పడింది. మిగతా కిమో సెషన్లు కూడా పూర్తయి త్వరలోనే నేను క్యాన్సర్‌ను జయిస్తానని విశ్వాసంగా ఉన్నా’’ అని సీమా తన కథను పంచుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని