ఆసియన్‌ అమెరికన్లపై ద్వేషం ఆపాలి: రిహానా

అమెరికాలోని ఆసియన్‌ అమెరికన్ల పట్ల ద్వేషం ఆపేయాలని ప్రముఖ అంతర్జాతీయ గాయకురాలు రిహానా విజ్ఞప్తి చేశారు. అట్లాంటాలో ఆసియన్లకు చెందిన మసాజ్‌ పార్లర్లు లక్ష్యంగా జరిగిన కాల్పుల ఘటనపై ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు.

Published : 18 Mar 2021 12:13 IST

వాషింగ్టన్‌: ఆసియన్‌ అమెరికన్లను ద్వేషించడం ఆపేయాలని ప్రముఖ అంతర్జాతీయ గాయకురాలు రిహానా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అట్లాంటాలో ఆసియన్లకు చెందిన మసాజ్‌ పార్లర్లే లక్ష్యంగా జరిగిన కాల్పుల ఘటనను ఆమె తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా అట్లాంటాలోని ఆసియా సంతతి ప్రజలకు ఆమె మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ఆమె ట్వీట్‌ చేశారు. 

‘అట్లాంటాలో నిన్న జరిగిన జరిగిన ఘటన ఎంతో విషాదకరం. ఒకరి పట్ల ద్వేషం వ్యాప్తిచేయడం అనేది ఎంతో అసహ్యకరమైన విషయం. ఆసియా సంతతి ప్రజలే లక్ష్యంగా జరిగిన దాడి నన్ను బాధించింది. ఈ ఘటనలో మరణించిన వారికి నివాళి అర్పిస్తున్నా. అమెరికన్లు ఈ ద్వేషానికి స్వస్తి పలకాలి’ అని రిహానా ట్వీట్‌లో పేర్కొన్నారు.

మరోవైపు మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల సైతం ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ‘ప్రపంచవ్యాప్తంగా ఆసియా అమెరికన్లకు, ఆసియా సంతతి వ్యక్తులపై వ్యతిరేకంగా జరుతున్న విద్వేషపూరిత చర్యలు బాధాకరం. జాత్యహంకారానికి, హింసకు సమాజంలో చోటు లేదు. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా మార్పు తీసుకువచ్చి, ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు మనం కృషి చేయాలి’ అని మైక్రోసాఫ్ట్‌ చేసిన ట్వీట్‌ను నాదెళ్ల రీట్వీట్‌ చేశారు. 

అమెరికాలోని అట్లాంటాలో ఆసియన్లకు చెందిన వేర్వేరు మసాజ్‌ పార్లర్లపై నిన్న కొందరు వ్యక్తులు కాల్పులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మొత్తం ఎనిమిది మంది మరణించగా.. వారిలో ఆసియాకు చెందిన మహిళలే అధికంగా ఉన్నారు. అయితే, ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న రాబర్ట్‌ ఆరోన్‌ లాంగ్‌ అనే 21ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై హత్యకేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. 



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని