Published : 03 May 2022 01:38 IST

Modi: బెర్లిన్‌లో మోదీకి ‘స్వీట్ గిఫ్ట్’.. బాలుడి పాటకు చిటికెలు వేసి, ఉత్సాహపరిచిన ప్రధాని

బెర్లిన్‌: మూడు రోజుల ఐరోపా పర్యటనలో భాగంగా జర్మనీ చేరుకున్న ప్రధాని మోదీకి ప్రవాస భారతీయుల నుంచి ఆత్మీయ ఆహ్వానం లభించింది. ఈ క్రమంలో కొందరు చిన్నారులు ఆకట్టుకునే బహుమతులు ఇచ్చి, ఆయన్ను మెప్పించారు. ఒక పాప తాను గీసిన చిత్రాన్ని బహూకరించగా.. ఓ బాలుడు దేశభక్తి గీతం ఆలపించాడు. 

ఈ రోజు ఉదయం బెర్లిన్‌లోని అడ్లోన్ కెంపిన్‌స్కీ హోటల్ వద్ద ప్రవాస భారతీయులు మోదీని ఆహ్వానిస్తూ.. ‘వందేమాతరం’, ‘భారత్‌ మాతాకీ జై’ అంటూ నినాదాలు చేశారు. ఆ సమయంలో ఓ పాప మోదీపై చిత్రాన్ని గీసి, ఆయనకే అందించింది. దానిలో తనను తాను చూసుకున్న ప్రధాని.. ఆశ్చర్యానికి గురయ్యారు. దీనిని గీయడానికి ఎంతసేపు పట్టిందంటూ ఆమెను ప్రశ్నించారు. అలాగే కొద్దిసేపు ఆ చిన్నారితో ముచ్చటించారు. అప్పుడామె ‘మీరే నా ఐడల్’ అంటూ చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను కేంద్రమంత్రి పియూష్ గోయల్ ట్విటర్‌లో షేర్ చేశారు. 

అక్కడే ఉన్న ఓ బాలుడు దేశభక్తి గీతం పాడి వినిపించారు. ఆ పాట వింటున్నంత సేపు.. మోదీ చిటికెలు వేస్తూ అతడిని ఉత్సాహపరిచారు. తర్వాత వాహ్‌ అంటూ మెచ్చుకున్నారు. మిగతావారు ఆయనకు చేతులు ఊపుతూ పలకరించారు. కొందరైతే ఆయన పాదాలకు నమస్కరించారు. ఈ ఆత్మీయ స్వాగతంపై ప్రధాని ఆనందం వ్యక్తం చేశారు. ‘జర్మనీలోని ప్రవాస భారతీయుల్ని కలుసుకోవడం సంతోషంగా ఉంది. మీ పట్ల దేశం గర్విస్తోంది’ అంటూ తన ఫేస్‌బుక్‌ పేజ్‌లో ఆ చిత్రాలను షేర్ చేశారు. 

ఇక ఐరోపా పర్యటనలో భాగంగా తొలుత జర్మనీ ఛాన్సలర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌తో కలిసి భారత్‌-జర్మనీ అంతర్‌ ప్రభుత్వ సంప్రదింపుల (ఐజీసీ) సమావేశంలో మోదీ పాల్గొన్నారు. అలాగే, మంగళవారం నాడు డెన్మార్క్‌ చేరుకోనున్న మోదీ.. రెండో భారత్‌-నార్డిక్‌ సదస్సులో డెన్మార్క్‌, ఐస్‌లాండ్‌, ఫిన్లాండ్‌, స్వీడన్‌, నార్వే దేశాధినేతలతో భేటీ అవుతారు. డెన్మార్క్‌ నుంచి భారత్‌ తిరిగి వస్తూ పారిస్‌లో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌ని ప్రధాని మోదీ కలవనున్నారు.


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని