Heat wave Alert: 5 రాష్ట్రాలకు IMD వార్నింగ్‌.. కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు 45డిగ్రీలు ఉండొచ్చు!

దేశంలో భానుడు భగభగ మండుతున్నాడు. ఉదయం 8గంటలకే సూరీడు సుర్రుమంటున్నాడు. దీంతో బయటకు అడుగు పెట్టాలంటేనే ......

Published : 28 Apr 2022 19:11 IST

దిల్లీ: దేశంలో భానుడు భగభగ మండుతున్నాడు. ఉదయం 8గంటలకే సూరీడు సుర్రుమంటున్నాడు. దీంతో బయటకు అడుగు పెట్టాలంటేనే జనం బెంబేలెత్తిపోతున్నారు. ఎండల తీవ్రత కొనసాగుతున్న వేళ భారత వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీచేసింది. రాబోయే ఐదు రోజుల్లో కనీసం 5 రాష్ట్రాల్లో వడగాడ్పులతో పాటు భారీగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. పలుచోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45డిగ్రీలు దాటొచ్చని అంచనా వేసింది. వచ్చే మూడు రోజుల్లో వాయువ్య భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందన్న వాతావరణాశాఖ.. ఆ తర్వాత 2డిగ్రీల మేర తగ్గుతుందని పేర్కొంది. ముఖ్యంగా రాజస్థాన్‌, దిల్లీ, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌, ఒడిశాలలోని పలు చోట్ల ఉష్ణోగ్రతలు 45డిగ్రీలకు పైగా నమోదు కావొచ్చంది. ఈ ఎండల తీవ్రత మే మొదటి వారం వరకు కొనసాగవచ్చనీ.. ఆ తర్వాత వర్షాలు పెరిగే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ సైంటిస్ట్‌ ఆర్‌కే జెనమణి తెలిపారు. దిల్లీలో ఈరోజు ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల స్థాయిని తాకే అవకాశం ఉందని అంచనా వేసిన అధికారులు.. దేశ రాజధాని నగరంలో శుక్రవారం రికార్డు స్థాయిలో 44డిగ్రీల సెల్షియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. 

మరోవైపు, కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లో ఉష్ణోగ్రతలు 40డిగ్రీల స్థాయిని తాకాయి. ఉష్ణోగ్రతలు  భారీగా పెరగడంతో అక్కడ పలుచోట్ల విద్యుత్‌ కోతలు, నీటిసంక్షోభానికి దారితీసింది. ఒడిశాలో గత కొన్నిరోజులుగా ఎండలు మండిపోతున్నాయి. వరుసగా మూడో రోజూ దాదాపు 24 ప్రాంతాల్లో 40డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడగాలుల తీవ్రతతో రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఏప్రిల్ 30 వరకు ప్రభుత్వం ఇటీవల సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో ఇప్పటికే పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం ముందస్తుగా వేసవి సెలవులు ఇచ్చేసింది. మే 2 వరకు కళాశాలలు, పాఠశాలలు మూసి ఉంచనున్నట్టు గతంలోనే ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని