Updated : 22 Oct 2021 15:17 IST

Poonch Encounter: ‘ఆపరేషన్‌ సర్ప్‌వినాశ్‌’ను తలపించేలా  పూంచ్‌ ఎన్‌కౌంటర్‌..

* 12 రోజులుగా ఆగని పోరు..

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం 

కశ్మీర్‌లో కనీవినీ ఎరుగని స్థాయిలో భారీ ఎన్‌కౌంటర్‌ జరుగుతోంది. 2003 తర్వాత ఈ స్థాయి ఎన్‌కౌంటర్‌ను కశ్మీర్‌ ప్రజలు చూడలేదు. పూంచ్‌లోని మెందహార్‌, సురాన్‌ కోటె రాజౌరీలోని థాన్మండీ అడవుల్లో నిన్న ఇరు పక్షాల నుంచి కాల్పులు నెమ్మదించినా.. నేడు మళ్లీ హోరాహోరీ పోరు మొదలైంది. నేటి తెల్లవారుజామున భారీగా కాల్పులు మొదలయ్యాయి. దీంతోపాటు ఐఈడీ పేలుళ్ల శబ్దాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. సైన్యం సర్వశక్తులు ఒడ్డి ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు పోరాడుతోంది.

అత్యంత అప్రమత్తంగా బలగాలు..

అక్టోబర్‌ 11వ తేదీన సురాన్‌కోటె వద్ద గస్తీ బృందాలపై ఉగ్రవాదులు దాడి చేసి ఐదుగురిని హత్యచేశారు. 14వ తేదీన మెందహార్‌ వద్ద మరోసారి దాడి చేశారు. ఈ ఘటనలో మరోనలుగురు భద్రతా సిబ్బంది మృతి చెందారు. ఈఎన్‌కౌంటర్‌లో ఇప్పటికే ఇద్దరు జూనియర్‌ కమిషన్డ్‌ ఆఫీసర్లతో సహా.. తొమ్మిది మంది సిబ్బందిని కోల్పోవాల్సి వచ్చింది. దీంతో మరోసారి ప్రాణనష్టం జరగకుండా దళాలు ఇక్కడ ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తూ ముందుకు వెళుతున్నాయి. ఈ ఆపరేషన్‌లో కనీసం 3000 మంది సైనికులు పాల్గొన్నట్లు వార్తలొస్తున్నాయి. సైన్యం దీనిని ధ్రువీకరించలేదు.

ఎన్‌కౌంటర్‌ జరుగుతున్న ప్రదేశం పూంచ్‌-రాజౌరీ జాతీయ రహదారికి కొన్ని కిలోమీటర్ల దూరంలోని భాటా దురియాన్‌  అడవిలో ఉంది. ఈ చిక్కటి అడవిలో ఉగ్రవాదులు నక్కి భద్రతా దళాలపై  దాడులు చేస్తున్నారు. దీంతో భద్రతా దళాలు జమ్ము‌-రాజౌరీ జాతీయ రహదారిని మూసివేశాయి. వివిధ రకాల ఆయుధాలను దళాలు ఈ ఎన్‌కౌంటర్‌లో వినియోగిస్తున్నాయి. దళాల భద్రత దృష్ట్యా ఈ ఆపరేషన్‌కు సంబంధించిన ఎటువంటి సమాచారాన్ని సైన్యం బయటకు పొక్కనీయడంలేదు. పలు ఉగ్రస్థావరాలను సైన్యం పేల్చివేసింది. ఆర్మీ చీఫ్‌ ఎంఎం నరవణే కూడా మంగళవారం కశ్మీర్‌కు వెళ్లి క్షేత్రస్థాయి పరిస్థితిని తెలుసుకున్నారంటే దీని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

 

ఐఈడీ ఉచ్చు..

పూంచ్‌ సబ్‌డివిజన్‌లోని సురాన్‌కోటె అడవిలో కూంబింగ్‌ చేస్తున్న భద్రతా దళాలు పెను ప్రమాదాన్ని తప్పించుకొన్నాయి. ఓ చెట్టుకొమ్మకు వేలాడదీసిన ఐఈడీని గుర్తించాయి. వెంటనే బాంబ్‌ స్క్వాడ్‌ను పిలిపించి దానిని సురక్షితంగా పేల్చివేశాయి. ఈ అటవీ ప్రాంతంలో మొత్తం 8 మంది ఉగ్రవాదులు ఉండొచ్చని అంచనావేస్తున్నారు. ఇప్పటికే ఉగ్రవాదులకు సరుకులు, సమాచారం చేరవేస్తున్నారనే అనుమానంతో పలువురిని అదుపులోకి తీసుకొన్నారు.

నాడు పాక్‌ ఆధీనంలోకి వెళ్లిన బకర్వాల్‌ గ్రామం..

ప్రస్తుతం ఈ ఎన్‌కౌంటర్‌ను చూస్తే 2003లో జరిగిన ‘ఆపరేషన్‌ సర్ప్‌వినాశ్‌’ గుర్తొస్తుంది. ఆ ఆపరేషన్‌ కూడా సురేన్‌కోటె వద్దనే జరిగింది. 1999లో సురాన్‌కోటె ప్రాంతంలోని హల్కాక అనే బకర్వాల్‌(గొర్రెలకాపర్ల) గ్రామాన్ని ఉగ్రవాదులు తమ ఆధీనంలోకి తీసుకొన్నారు. ఇది చిక్కటి అడవిలో ఎల్‌వోసీకి 10-12 కిలోమీటర్ల లోపల ఉంటుంది. పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌, అల్‌ బదర్‌ సహా పలు గ్రూపులకు చెందిన ఉగ్రమూకలు ఇక్కడ తిష్ఠవేశాయి. పర్వత వాలు ప్రదేశాల్లో బకర్వాల్స్‌ వినియోగించే షెడ్లను తమ బంకర్లుగా మార్చుకొన్నాయి. అక్కడ కాంక్రీట్‌ కట్టడాలను నిర్మించాయి. ఉగ్రవాదులు ఇక్కడ ఏకంగా ఒక ఆసుపత్రినే నిర్మించారు. దీంతోపాటు 500 మందికి రెండు నెలలకు సరిపడా ఆహార పదార్థాలను నిల్వ చేసుకొన్నారు. పాకిస్థాన్‌ అక్కడ ఏకంగా సమాంతర పాలన సాగించింది. ఇక్కడి పరిస్థితిని గమనించిన సైన్యం పలుమార్లు దాడులు నిర్వహించింది. కానీ, పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రాలేదు. దీంతో ‘ఆపరేషన్‌ సర్ప్‌ వినాశ్‌’ చేపట్టాలని నిశ్చయించింది.

అప్పటికే కార్గిల్‌ యుద్ధాన్ని భారత్‌-పాక్‌లు పూర్తిగా మర్చిపోలేదు. దీనికి తోడు 2001లో పార్లమెంట్‌ దాడి తర్వాత ‘ఆపరేషన్‌ పరాక్రమ్‌’ కూడా భారత్‌ చేపట్టింది. దీంతో ‘ఆపరేషన్‌ సర్ప్‌ వినాశ్‌’లో ఏమాత్రం తేడా వచ్చినా అది ఇరుదేశాల మధ్య పూర్తి స్థాయి యుద్ధంగా మారే ప్రమాదం ఉంది. దీంతో సైన్యం అన్ని ఏర్పాట్లు చేసుకొన్న తర్వాతే తుది దాడిని మొదలుపెట్టింది.

అప్పట్లో 64 మంది ఉగ్రవాదుల హతం..

2003 జనవరిలో పీర్‌పంజాల్‌ పర్వత శ్రేణుల్లోని మూడు శిఖరాల మధ్య 150 చదరపు కిలోమీటర్లలో సైన్యం తుది ఆపరేషన్‌ ఏర్పాట్లు మొదలుపెట్టింది. మొత్తం మూడు బ్రిగేడ్లకు సరిపడా 15,000 మంది సైనికులు దీనిలో పాల్గొన్నారు.  అదే ఏడాది ఏప్రిల్‌-మే నెలల మధ్య భద్రతా దళాలకు ఉగ్రవాదులకు మధ్య ఒక చిన్నసైజు యుద్ధమే జరిగింది. ఎంఐ17 హెలికాప్టర్లతో దళాలను ఎన్‌కౌంటర్‌ ప్రదేశంలో జారవిడిచారు. లాన్సర్‌ హెలికాప్టర్‌తో దాడులు చేశారు. మొత్తం 64 మంది ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. ఏకే 47, పీకా గన్స్‌, గ్రనేడ్‌ లాంఛర్లు, సెల్ఫ్‌లోడెడ్‌ రైఫిల్స్‌, పేలుడు పదర్థాలు, భారీ సంఖ్యలో రేడియో సెట్లు దొరికాయి. ఆపరేషన్‌ తర్వాత అక్కడి బకర్వాల్‌ వాసులకు ప్రభుత్వం రూ.7.5 కోట్ల  పరిహారం అందజేసి.. ఆ ప్రాంతాన్ని మూసి వేయాలని ఆదేశించింది. ఆ తర్వాత ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని రోడ్లతో అనుసంధానించింది. అక్కడి గుజ్జర్‌-బకర్వాల్‌ తెగలోని వారికి ఆర్మీ పోర్టర్లు ఉద్యోగాలు ఇచ్చింది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని