Bengaluru: బెంగళూరును ముంచెత్తిన వర్షం.. ఏపీకి చెందిన టెకీ మృతి

బెంగళూరులో భారీ వర్షం కురిసింది. ఆర్కే సర్కిల్‌లో భారీగా వరదనీరు చేరింది. దీంతో విహారయాత్రకు వెళ్లిన ఓ తెలుగు కుటుంబం అందులో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

Updated : 21 May 2023 20:50 IST

బెంగళూరు: బెంగళూరు మహానగరాన్ని అకాల వర్షం ముంచెత్తింది. ఆదివారం మధ్యాహ్నం భారీ ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షం కురిసింది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. కొన్ని చోట్ల వడగండ్ల వాన కురిసింది. భారీగా గాలులు వీయడం వల్ల పెద్దపెద్ద వృక్షాలు నేలకొరిగాయి. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. కేఆర్‌ సర్కిల్‌ అండర్‌పాస్‌లో కారు చిక్కుకొని ఏపీకి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ భానురేఖ ప్రాణాలు కోల్పోయారు. కుమారకృప రోడ్డు మార్గంలో చెట్టు విరిగిపడటంతో ఆ మార్గంలో రాకపోకలను నిలిపివేశారు. చిత్రకళాపరిషత్‌ ఎదుట ఓ చెట్టు కుప్పకూలింది. దీంతో ఓ కారు, బైకు ధ్వంసమయ్యాయి.

అండర్‌పాస్‌లో చిక్కుకొని..

బెంగళూరు నగరంలో కురిసిన భారీ వర్షానికి కేఆర్‌ సర్కిల్‌ వద్ద అండర్‌పాస్‌లోకి పెద్దమొత్తంలో వరద నీరు చేరడంతో ఓ కారు చిక్కుకుపోయింది. అందులో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రయాణిస్తుండగా.. స్థానికులు నలుగురిని బయటకి తీశారు. అందులో భానురేఖ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. మిగతా ఇద్దరిని అతికష్టం మీద బయటకు తీశారు. వీరంతా ఏపీకి చెందిన వారిగా గుర్తించారు. విహారయాత్ర కోసం అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది.

కొత్తవారు కావడంతో అక్కడి పరిస్థితులను అంచనా వేయలేకపోయారు. అండర్‌ పాస్‌లో కొంతదూరం వెళ్లేసరికి కారు పూర్తిగా మునిగిపోయింది. ప్రాణభయంతో వారంతా బయటకి వచ్చేశారు. కానీ, అప్పటికే పీకల్లోతు నీటిలోకి వెళ్లిపోవడంతో కాపాడాలంటూ కేకలు వేశారు. గమనించిన స్థానికులు నలుగురిని బయటకి తీశారు. మరో ఇద్దరిని తేవడం కష్టంగా మారడంతో గజఈతగాళ్లను రప్పించి అండర్‌పాస్‌ బయటకి తీసుకొచ్చారు.

సిద్ధరామయ్య అత్యవసర భేటీ

బెంగళూరు నగరాన్ని అకాల వర్షం అతలాకుతలం చేయడంపై అకాల వర్షాలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.అవసరమైతే అత్యవసర ప్రతిస్పందన దళాలను రంగంలోకి దించాలని సూచించారు. బానురేఖ చికిత్స పొందిన ఆస్పత్రిని సిద్ధరామయ్య సందర్శించారు. మృతురాలి కుటుంబానికి రూ.5 లక్షల నష్టపరిహారం ప్రకటించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని