Mumbai Rains: జలమయమైన ముంబయి.. మరోసారి భారీ వర్ష సూచన

దేశ వాణిజ్య రాజధాని ముంబయిని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నిన్న రాత్రి నుంచి కురిసిన వర్షానికి నగరం జలమయమైంది. లోతట్టు ప్రాంతాలు మునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా..

Published : 05 Jul 2022 11:47 IST

ముంబయి: దేశ వాణిజ్య రాజధాని ముంబయిని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నిన్న రాత్రి నుంచి కురిసిన వర్షానికి నగరం జలమయమైంది. లోతట్టు ప్రాంతాలు మునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా.. రానున్న 24 గంటల్లో అతి భారం వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

ముంబయి నగరంలో 95.81 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. శివారు ప్రాంతాల్లోనూ 110 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. పట్టాలపై నీరు నిలవడంతో పలు చోట్ల లోకల్‌ రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. కొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. రహదారులపైకి భారీగా నీరు చేరడంతో ముంబయిలోని 8 మార్గాల్లో ట్రాఫిక్‌ను దారిమళ్లించారు. రానున్న గంటల్లో మరోసారి భారీ వర్షం కురిసే అవకాశమున్న నేపథ్యంలో నగరవాసులను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.

ముంబయితో పాటు ఠాణే, పాల్ఘర్‌, పుణెల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఠాణేలో సోమవారం ఉదయం నుంచి ఈ ఉదయం వరకు 146 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. పాల్ఘర్‌లో వర్ష ప్రభావానికి ఓ ఇల్లు కూలింది. కల్యాణ్‌, భీవండి ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు నీటమునగడంతో అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అమరావతి జిల్లాలో కురిసిన భారీ వర్షానికి వీధులు నదులను తలపిస్తున్నాయి. రాయగఢ్‌ జిల్లాలోని కుండలీకా నది ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది.

ఘాట్కోపర్‌లో విరిగిపడిన కొండచరియలు..

ముంబయిలోని ఘాట్కోపర్‌ ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి కొండచరియలు విరిగిపడ్డాయి. సమాచారమందుకున్న స్థానిక అధికారులు, రెస్క్యూ సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని