Karnataka: కర్ణాటక జలాశయాలకు వరద

ఎగువ కురుస్తున్న వర్షాలకు కన్నడనాట జలాశయాల్లోకి వరద చేరుతోంది. ముఖ్యంగా మల్నాడు ప్రాంతంలో కురుస్తున్న వానలకు తుంగ జలాశయానికి ప్రవాహాలు పెరిగాయి.

Published : 06 Jul 2024 04:26 IST

తుంగ జలాశయం నుంచి తుంగభద్ర దిశగా గంగమ్మ పరవళ్లు

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : ఎగువ కురుస్తున్న వర్షాలకు కన్నడనాట జలాశయాల్లోకి వరద చేరుతోంది. ముఖ్యంగా మల్నాడు ప్రాంతంలో కురుస్తున్న వానలకు తుంగ జలాశయానికి ప్రవాహాలు పెరిగాయి. దీంతో గురువారం నుంచి దిగువకు నీరు వదులుతున్నారు. శుక్రవారం వరద తీవ్రత పెరగడంతో 21 గేట్లను ఎత్తి 41 వేల క్యూసెక్కుల ప్రవాహాన్ని తుంగభద్ర జలాశయానికి విడుదల చేశారు. తుంగ ఎగువనున్న తీర్థహళ్లి, శృంగేరి తాలూకాల్లో వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి. తుంగ జలాశయ గరిష్ఠంగా నీటిమట్టం 588.24 అడుగులు కాగా.. బుధవారానికే ఇది 586.11 అడుగులకు చేరుకుంది. తుంగభద్ర గరిష్ఠ నీటిమట్టం 1,633 అడుగులకుగానూ శుక్రవారానికి 1,590.80 అడుగుల మేర నీరు చేరింది. ఇందులోకి 19,201 క్యూసెక్కుల వరద వస్తోంది. కొడగు, హాసన, మండ్య జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు 10 రోజులుగా కృష్ణరాజసాగర జలాశయంలోకి 10 వేల క్యూసెక్కులకు తగ్గకుండా వరద కొనసాగుతోంది. సోమవారం నుంచి మండ్య జిల్లాలోని పంట కాలువలు, చెరువులకు నీటిని విడుదల చేస్తామని కేఆర్‌ఎస్‌ అధికారులు తెలిపారు. ఆలమట్టిలో గరిష్ఠంగా 519.60 మీటర్ల వరకు నీటిని నిలువ చేసుకునేందుకు అవకాశం ఉండగా, ప్రస్తుతం 513.22 మీటర్ల వరకు నీరు చేరింది. ఆలమట్టిలోకి ఇన్‌ఫ్లో 53,901 క్యూసెక్కులుగా నమోదవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని