heavy rains: ఉరిమిన వరుణుడు.. పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వరదలు ముంచెత్తుతున్నాయి. అస్సాం, ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, బిహార్, పశ్చిమబెంగాల్, గుజరాత్, రాజస్థాన్‌ సహా ఈశాన్య ప్రాంతాల్లో కుంభవృష్టి వానలతో నదులన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి.

Updated : 08 Jul 2024 04:33 IST

అస్సాంలో 70కి చేరిన మృతుల సంఖ్య
ఉత్తరాఖండ్‌లో ఛార్‌ధామ్‌ యాత్ర వాయిదా
మహారాష్ట్రలో రిసార్టులోకి వరద
యూపీలో ప్రమాదకరంగా నదులు

గువాహటి, లఖ్‌నవూ, ముంబయి, పనాజీ, దేహ్రాదూన్‌: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వరదలు ముంచెత్తుతున్నాయి. అస్సాం, ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, బిహార్, పశ్చిమబెంగాల్, గుజరాత్, రాజస్థాన్‌ సహా ఈశాన్య ప్రాంతాల్లో కుంభవృష్టి వానలతో నదులన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో రవాణా మార్గాలు స్తంభించి జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. అస్సాంలో 24 లక్షల మందిపై వరదల ప్రభావం చూపుతోంది. దేవభూమి ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్‌ యాత్ర వాయిదా పడింది. మహారాష్ట్రలోని ఠాణేలో ఓ రిసార్టులోకి వరదనీరు చొచ్చుకొచ్చి పర్యాటకులను భయభ్రాంతులకు గురిచేసింది. గోవాలో పాలి జలపాతం సందర్శనకు వెళ్లిన పర్యాటకులు వరద కారణంగా అక్కడ చిక్కుకున్నారు. 

అస్సాంలో వరదల బీభత్సం

అస్సాం వ్యాప్తంగా బ్రహ్మపుత్ర నదితో సహా పలు ప్రధాన నదులు ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. మొత్తం 29 జిల్లాల్లోని 24 లక్షలమంది ప్రజలపై వరదలు ప్రభావం చూపుతున్నాయి. ధుబ్రి, కాచర్, దర్రాంగ్‌ వంటి జిల్లాల్లో అధికశాతం ప్రజలు నీటిలోనే తీవ్ర అవస్థలు పడుతున్నారు. తుపాను, వరదలు, కొండచరియలు విరిగిపడటం కారణంగా మృతి చెందినవారి సంఖ్య 70కి చేరుకుందని అధికారవర్గాలు తెలిపాయి. కాజీరంగా జాతీయ పార్కులో వరదల కారణంగా ఇప్పటి వరకూ 129 జంతువులు చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. 

ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ కామ్‌రూప్‌లో వరద సహాయక శిబిరాల్లో బాధితులను పరామర్శించారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సోమవారం అస్సాం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు.


బద్రీనాథ్‌ మార్గంలో ఆటంకాలు

ఉత్తరాఖండ్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీగా వరద నీరు వచ్చి చేరడంతో గంగా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఆదివారం రిషికేశ్‌లోని త్రివేణి ఘాట్, గంగా హారతి ప్రాంతాల్లో ప్రమాదకరంగా మారింది. దీంతో రాత్రివేళల్లో ఘాట్‌ల వద్దకు పర్యాటకులెవరూ వెళ్లొద్దని రాష్ట్ర విపత్తుల ప్రతిస్పందన దళం హెచ్చరికలు జారీ చేసింది. గఢ్‌వాల్‌ ప్రాంతంలో 7, 8 తేదీల్లో (ఆదివారం, సోమవారం) భారీ నుంచి అతిభారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ అంచనా వేయడంతో తాత్కాలికంగా చార్‌ధామ్‌ యాత్రను ఆదివారం నిలిపివేశారు. కొండచరియలు విరిగి రోడ్డుపై పడుతుండడంతో బద్రీనాథ్‌కు వెళ్లే మార్గంలో ఆటంకాలు ఏర్పడ్డాయి.


49 మందిని కాపాడిన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు

మహారాష్ట్రలో ఆదివారం గాలులతో కూడిన వాన బీభత్సం సృష్టించింది. ఠాణేలోని షాపూర్‌ ప్రాంతంలో ఓ రిసార్టును వరదనీరు చుట్టుముట్టగా.. అందులో చిక్కుకున్న 49 మందికి పైగా పర్యాటకులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్‌ఎఫ్‌) అధికారులు వెల్లడించారు. పాల్ఘార్‌ జిల్లాలో పొలంలో పనిచేస్తూ వరదలో చిక్కుకున్న 16 మంది గ్రామస్థులను అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రక్షించాయి. పలు రైల్వే ట్రాక్‌లపై మట్టి, నీరు చేరడం, చెట్టు కూలిపోవడం వంటి ఘటనలతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.


ఉత్తర్‌ప్రదేశ్‌లో మరికొన్ని రోజులు భారీ వర్షాలు

రుతుపవనాల ప్రభావంతో ఉత్తర్‌ప్రదేశ్‌ను వర్షాలు, వరదలు చుట్టుముట్టాయి. కుషినగర్, బలరాంపుర్, సరస్వతి జిల్లాలు నీటమునిగాయి. సరస్వతి జిల్లాలో పొలం పనులు చేసుకుంటున్న 12 మంది మహిళలను వారి చిన్నారులను వరదల నుంచి కాపాడారు. నారాయణ్‌పుర్‌ ప్రాంతంలో 66 మంది వరదల్లో చిక్కుకోగా వారిలో 62 మందిని రక్షించారు. మిగిలిన వారిని కాపాడేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. రాష్ట్రంలోని అనేక నదుల్లో నీటిమట్టాలు ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. గోరఖ్‌పుర్, బహ్రైచ్, గోండా, బస్తి, సంత్‌ కబీర్‌ నగర్, మహారాజ్‌గంజ్, బలరాంపుర్, సరస్వతి, లఖింపుర్‌ సహా పలు జిల్లాల్లో వచ్చే కొద్ది రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. 


ఇంకా 30 మంది అక్కడే..

గోవాలోని సత్తారి తాలూకాలో ఓ నదిని దాటుకుని పాలి జలపాతానికి ఆదివారం భారీ సంఖ్యలో పర్యాటకులు వెళ్లారు. అప్పటికే భారీ వర్షం రావడంతో నది నీటి మట్టం ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో ఓ 80 మంది అక్కడే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు రంగంలోకి దిగి 50 మందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. మరో 30 మంది అక్కడే చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు.  

  • పశ్చిమబెంగాల్‌లో పలు జిల్లాలో ఎడతెరిపిలేకుండా వానలు కురుస్తున్నాయి. హిమాలయ ప్రాంతానికి చెందిన దార్జీలింగ్, కాలింపోంగ్, జల్‌పాయ్‌గురి, కూచ్‌బిహార్, అలిపుర్‌దౌర్‌ జిల్లాల్లో ఈ నెల 12 వరకూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. 
  • బిహార్‌లో గడచిన 24 గంటల్లో భాగమతి, గండకి, కమ్లా బాలన్, పరమాణ్, కోసి నదులు ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. 
  • రాజస్థాన్‌లో గత 24 గంటల్లో ఓ మాదిరి నుంచి భారీ వర్షాలు కురిసాయి. అత్యధికంగా చురు జిల్లా తారనగర్‌లో 141 మిల్లీమీటర్ల వాన పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని