
Heavy Rains: చెన్నైలో వర్ష బీభత్సం..నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్!
చెన్నై: ఇటీవల భారీ వర్షాలతో అతలాకుతలమైన తమిళనాడును మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. గురువారం మధ్యాహ్నం నుంచి ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చెన్నైలోని పలు రహదారులన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. ఈ వర్షాల కారణంగా విద్యుదాఘాతానికి గురై ముగ్గురు మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో వర్షాల ప్రభావంపై ముఖ్యమంత్రి స్టాలిన్ సమీక్షించారు. కంట్రోల్ రూమ్తో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ఈ వర్ష బీభత్సానికి పలు చోట్ల చెట్లు కూలిపోయాయి. మరోవైపు, భారీ వర్షాలతో చెన్నై, కాంచీపురం, చెంగళ్పట్టు, తిరువళ్లూరు ప్రాంతాల్లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీచేసింది. మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆయా ప్రాంతాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఈ వర్షాల కారణంగా నగరంలో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వేలాది వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. భారీ వరద నీటితో చెన్నైలోని మూడు సబ్-వేల నుంచి రాకపోకల్ని అధికారులు నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు వర్షపు నీటిలోనే అవస్థలు ఎదుర్కొంటున్నారు. చెన్నైతో పాటుగా తిరువళ్లూరు, కాంచీపురం సహా ఇతర ప్రాంతాలనూ భారీ వర్షాలు ముంచెత్తాయి. టి.నగర్లో శుక్రవారం ఉదయం మోకాలి లోతు వరకు నీరు కనిపించింది. కొన్ని రోడ్లను మూసివేశారు. వరద నీరు తమ ఇళ్లలోకి రాకుండా ప్రజలు ఇసుక బస్తాలను వేశారు. టి.నగర్లోని నిన్న ఆరు గంటల పాటు భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ వరదనీటిలో చిక్కుకున్నాయి. దీంతో ఈ రోజు కార్యాలయాలకు వెళ్లలేకపోయినట్టు పలువురు స్థానికులు పేర్కొన్నారు. ఇంకొన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున.. తమ ప్రాంతంలో నీరు నిలిచిపోకుండా ప్రభుత్వం చొరవ తీసుకొని శాశ్వత పరిష్కారాన్ని చూపేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.