Mumbai Rains: 6 గంటల్లో 300 మి.మి.ల వాన.. ముంబయిని వణికించిన వరుణుడు

Mumbai Rains: ముంబయిలో ఆరు గంటల్లోనే 300 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దీంతో నగరం అస్తవ్యస్తమైంది. లోకల్‌ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Updated : 08 Jul 2024 10:23 IST

ముంబయి: దేశ వాణిజ్య రాజధాని ముంబయిని భారీ వర్షాలు (Mumbai Rains) ముంచెత్తాయి. ఆరు గంటల పాటు ఏకధాటిగా కుంభవృష్టి కురవగా రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. దీంతో నగరంలో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు ముంబయి (Mumbai) వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. దీంతో 300 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. అత్యధికంగా గోవండి ప్రాంతంలో 315 మి.మి., పోవాయ్‌లో 314 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు వెల్లడించారు. వర్షం కారణంగా సెంట్రల్‌ రైల్వే సబర్బన్‌ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. పట్టాలు మునిగిపోవడంతో చాలా లోకల్‌ రైళ్ల (Local Trains) రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. ముంబయి, ఠాణె, పాల్ఘర్‌, రాయ్‌గడ్‌లో ప్రతిరోజు దాదాపు 30లక్షల మంది సబర్బన్‌ లోకల్‌ రైలు సేవలను వినియోగించుకుంటారు.

వర్షం కారణంగా ముంబయిలోని అనేక లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు రహదారులపై మోకాలి లోతు నీరు రావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల ట్రాఫిక్‌జామ్‌ కొనసాగుతోంది. అటు స్కూళ్లు, కాలేజీలకు నేడు సెలవు ప్రకటించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. సోమవారం కూడా ముంబయిలో భారీ నుంచి అతిభారీ వర్షం (Heavy to Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేశారు. ముంబయితో పాటు ఠాణె, పాల్ఘర్‌, కొంకణ్‌ బెల్ట్‌కు ఐఎండీ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

ఇక నిన్న ఠాణెలోని షాపూర్‌ ప్రాంతంలో ఓ రిసార్టును వరద నీరు చుట్టుముట్టగా.. అందులో చిక్కుకున్న 49 మందికి పైగా పర్యటకులను ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. పాల్ఘార్‌ జిల్లాలో పొలంలో పనిచేస్తూ వరదలో చిక్కుకున్న 16 మంది గ్రామస్థులను అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రక్షించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని