Heavy Rains: ముంచెత్తిన వాన.. మునిగిన ముంబయి

దేశంలోని పలు రాష్ట్రాల్లో రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వానలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతూ అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి.

Published : 09 Jul 2024 03:48 IST

ముంబయిలోని అంధేరీలో వరద ఉద్ధృతి

దిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వానలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతూ అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో  ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం ఏడు గంటల వరకూ ఆరుగంటల పాటు రికార్డు స్థాయిలో 30.0 సెంటీ మీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. అత్యధికంగా గోవండి ప్రాంతంలో 31.5 సెం.మీ., పోవాయ్‌లో 31.4 సెం.మీ. వర్షం కురిసినట్లు అధికారులు వెల్లడించారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. పలు ప్రాంతాల్లో నిలిచిన నీటితో ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టెర్మినస్‌ నుంచి ఠాణే మధ్య రైలు సేవలను కొన్ని గంటలపాటు నిలిపేశారు. దృశ్య స్పష్టత లోపించడంతో సోమవారం తెల్లవారుజామున 2.22 గంటల నుంచి 3.40 గంటల వరకూ రన్‌వేపై కార్యకలాపాలు నిలిపేశారు. అనంతరం ఉదయం 11 గంటల వరకూ 50 విమానాలను రద్దు చేశారు. ఠాణేలో కొండచరియలు విరిగిపడటంతో నాలుగు ఇళ్లకు చెందిన పౌరులు సహా ఇళ్లు నీటమునగడంతో మరో 54 మందిని సహాయకబృందాలు రక్షించాయి. ముంబయిలో రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవడంతో శాసనసభ సమావేశాలకు పెద్ద సంఖ్యలో చట్టసభ సభ్యులు, అధికారులు హాజరుకాలేకపోవడంతో ఉభయసభలు వాయిదాపడ్డాయి. కుర్లా వద్ద రాష్ట్ర మంత్రి అనిల్‌ పటేల్‌ సహా 15 మంది ప్రజాప్రతినిధులు ఒక రైలులో చిక్కుకుపోయారు.  

  • గోవాలో మూడు రోజులుగా కురుస్తున్న వానలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. 
  • అస్సాంలో వీడని వరదలతో 24 లక్షల మంది ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. 53 వేల మంది నిరాశ్రయులయ్యారు. 60 మందికిపైగా మృత్యువాత పడ్డారు.  
  • ఉత్తరాఖండ్‌లో వర్షాల కారణంగా రహదారులు నీటమునిగి, కొండచరియలు విరిగిపడి అనేక ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ స్తంభించింది. చార్‌ధామ్‌ యాత్రను సోమవారం పునరుద్ధరించారు.  
  • బిహార్‌లోని ఏడు జిల్లాల్లో పిడుగుపాటుకు గురై 12 మంది మరణించారు.  
  • హిమాచల్‌ప్రదేశ్‌లో వానలతో కొండచరియలు విరిగిపడి జాతీయ రహదారి సహా 70 రోడ్లను మూసివేశారు. 
  • రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో గడచిన 24 గంటల్లో కురిసిన వానలు అక్కడి జనజీవనాన్ని అస్తవ్యవస్తం చేశాయి. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని