Rains: భారీ వర్షాలు.. ‘మహా’ సీఎం ఇంటి చుట్టూ వరదనీరు

రుతుపవనాల ప్రభావంతో మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రాజధాని ముంబయి సహా ఠాణే, పాల్ఘర్‌ తదితర జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఠాణె జిల్లాలో నిన్న రాత్రి కురిసిన భారీ

Published : 07 Jul 2022 13:51 IST

ముంబయి: రుతుపవనాల ప్రభావంతో మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రాజధాని ముంబయి సహా ఠాణే, పాల్ఘర్‌ తదితర జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఠాణే జిల్లాలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే నివాసం చుట్టూ వరదనీరు చేరింది.

ఠాణేలోని లూయిస్‌వాడీ ప్రాంతంలోని సీఎం నివాసం చుట్టూ వరద నీరు చేరిందని ఈ ఉదయం స్థానిక రెస్క్యూ సిబ్బందికి సమాచారం అందినట్లు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రాంతీయ విపత్తు నిర్వహణ విభాగ చీఫ్ అవినాశ్ సావంత్ తెలిపారు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకొని వరద నీరు తొలగించినట్లు పేర్కొన్నారు.

మూడు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌..

రాష్ట్రంలోని పలు జిల్లాలో గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మూడు రోజుల్లో పుణె, సతారా, కొల్హాపూర్‌ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో ఆ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. అటు ముంబయిలో గురువారం కూడా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. వర్షం కారణంగా లోక్‌ల్‌ రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.

కర్ణాటకలో ముగ్గురు మృతి..

కర్ణాటకలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ కన్నడ జిల్లాలోని పంజికల్‌ ప్రాంతంలో వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. ఉడుపి జిల్లాలో రానున్న 24 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా స్కూళ్లు, కాలేజీలను మూసివేశారు. పర్యాటకులు, మత్స్యకారులు సముద్రం వైపు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. బెళగావికి వరద హెచ్చరికలు జారీ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని