Hemant Soren: బల పరీక్షలో నెగ్గిన హేమంత్‌ సోరెన్

ఇటీవల మూడోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన హేమంత్ సోరెన్‌ (Hemant Soren).. ఝార్ఖండ్ అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో విజయం సాధించారు. 

Published : 08 Jul 2024 13:32 IST

రాంచీ: అసెంబ్లీలో సోమవారం నిర్వహించిన బల పరీక్షలో ఝార్ఖండ్ ముఖ్యమంత్రి, జేఎంఎం నేత హేమంత్ సోరెన్‌ (Hemant Soren) నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం విజయం సాధించింది. 81 మంది చట్టసభ సభ్యులకు గానూ 45 మంది ఆయనకు అనుకూలంగా ఓటేశారు. ఈ ఓటింగ్ జరుగుతోన్న సమయంలో విపక్షాలు వాకౌట్ చేశాయి.

భూకుంభకోణం కేసులో అరెస్టయి ఇటీవలే బెయిల్‌పై విడుదలైన హేమంత్‌.. 5 నెలల తర్వాత నాలుగు రోజుల క్రితం ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. ఆ కేసులో జనవరి 31న ఈడీ అధికారులు హేమంత్‌ సోరెన్‌ను అరెస్టు చేశారు. ఈ పరిణామానికి కొద్దిసేపటిముందే ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో ఫిబ్రవరి 2న చంపయీ సోరెన్‌ రాష్ట్ర 12వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. హేమంత్‌కు హైకోర్టు తాజాగా బెయిల్‌ మంజూరుచేయడంతో జూన్‌ 28న బిర్సా ముండా జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. అనంతరం చంపయీ రాజీనామా చేయడంతో, హేమంత్‌ మూడోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. తర్వాత ఆయన అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

అధికార కూటమిలో జేఎంఎం, కాంగ్రెస్‌, ఆర్జేడీ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. విపక్ష కూటమికి 30 మంది సభ్యులున్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పలువురు ఎమ్మెల్యేలు ఎంపీ స్థానాలకు పోటీ చేయడంతో అసెంబ్లీలో సంఖ్యా బలం 76కు పడిపోయింది. దాంతో మెజార్టీ మార్కు 39ని దాటి, సోరెన్‌కు అనుకూలంగా 45 ఓట్లు వచ్చాయి. కాగా.. కొత్త కేబినెట్‌లో సీఎం సతీమణి కల్పనా సోరెన్‌కు చోటు దక్కే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని