Updated : 01 Jun 2021 11:46 IST

మోదీజీ డబ్బుల్లేవు..టీకాలు మీరే ఇవ్వండి!

కేంద్రం తీరుపై ఝార్ఖండ్‌ సీఎం తీవ్ర అసంతృప్తి

రాంచీ: తమ రాష్ట్రంలో 18-44 ఏళ్ల మధ్య వయసు వారికి కేంద్రమే ఉచితంగా కొవిడ్‌ టీకాలు అందజేయాలని కోరుతూ ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ వర్గానికి టీకాలు అందజేయడానికి దాదాపు రూ.1,100 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. కానీ, కరోనా వల్ల ఇప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉన్న తమ ఆర్థిక వ్యవస్థకు ఇది పెనుభారంగా మారే అవకాశం ఉందని తెలిపారు. కావున కేంద్రమే ఈ వర్గానికి టీకాలు ఉచితంగా అందజేయాలని విజ్ఞప్తి చేశారు. రానున్న రోజుల్లో 12-18 ఏళ్ల వయసు వారికి కూడా టీకాలు అందించేందుకు అనుమతులు వస్తే.. మరో రూ.1,000 కోట్లు అవసరం అవుతుందని లేఖలో ప్రస్తావించారు.

కేంద్రం నుంచి సరిపడా టీకా డోసులు ఝార్ఖండ్‌కు అందడం లేదని సోరెన్‌ తెలిపారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు ఇది పెద్ద అవరోధంగా మారిందని పేర్కొన్నారు. రాష్ట్రాలే తమ సొంతంగా వ్యాక్సిన్లు కొనుగోలు చేసుకోవడాన్ని కేంద్రం తప్పనిసరి చేయడం స్వతంత్ర భారత చరిత్రలో ఇదే తొలిసారని సోరెన్‌ అభిప్రాయపడ్డారు. యావత్తు దేశం కరోనా మహమ్మారితో విలవిల్లాడుతున్న సమయంలో టీకాల సమీకరణ బాధ్యతను రాష్ట్రాలపైకి నెట్టడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని వ్యాఖ్యానించారు.

కరోనా రెండో దశ విజృంభణతో ఝార్ఖండ్‌ ఆరోగ్య సంరక్షణా వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి ఏర్పడిందని సోరెన్‌ తెలిపారు. మహమ్మారిని అదుపు చేయాలంటే ప్రతిఒక్కరికీ టీకా అందించడం ఒక్కటే మార్గమని అభిప్రాయపడ్డారు. ఝార్ఖండ్‌ ప్రజలకు వీలైనంత వేగంగా టీకాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. టీకాలు సమీకరించుకునేందుకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నామని తెలిపారు. అలాగే కేంద్రంతో పోలిస్తే రాష్ట్రాలకు అందుతున్న టీకా ధరలు అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే రాష్ట్రాల సాంస్కృతిక, సామాజిక, భౌగోళిక వాతావరణాన్ని బట్టి మహమ్మారి ముప్పు సోకే వర్గీకరణ మారుతుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో కేంద్రమే టీకా లబ్ధిదారులను గుర్తించడం సరికాదన్నారు. వ్యాక్సిన్‌ కేటాయింపుల్లో కేంద్రం ఏమాత్రం పారదర్శకత పాటించడం లేదని సోరెన్‌ ఆరోపించారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో కంపెనీలే ఆయా ప్రాంతాల్లో ప్రజలకు టీకాలు అందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చే పరిస్థితి ఏర్పడిందన్నారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని