ఆమె వేసుకున్న డ్రెస్సే లైంగికంగా రెచ్చగొట్టేలా ఉంది.. కోర్టు వివాదాస్పద వ్యాఖ్యలు

ఫిర్యాదుదారు లైంగికంగా రెచ్చగొట్టే విధంగా ఉన్న దుస్తులు ధరించినప్పుడు.. వారు చేసే లైంగిక వేధింపుల ఆరోపణలు ప్రాథమికంగా

Published : 17 Aug 2022 15:43 IST

తిరువనంతపురం: ఫిర్యాదుదారు లైంగికంగా రెచ్చగొట్టే విధంగా ఉన్న దుస్తులు ధరించినప్పుడు.. వారు చేసే లైంగిక వేధింపుల ఆరోపణలు ప్రాథమికంగా నిలబడవని కేరళలోని ఓ కోర్టు వ్యాఖ్యానించింది. లైంగిక వేధింపులు ఎదుర్కొంటోన్న ఓ సామాజిక కార్యకర్తకు బెయిల్‌ మంజూరు చేస్తూ కోర్టు ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. కేసు వివరాల్లోకి వెళితే..

కేరళకు చెందిన 74 ఏళ్ల సామాజిక కార్యకర్త, రచయిత చంద్రన్‌ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఓ యువ రచయిత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2020 ఫిబ్రవరి 8న నందీ బీచ్‌లో చంద్రన్‌ తనను నిర్మానుశ్య ప్రదేశానికి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించింది. కాగా.. రెండేళ్ల క్రితం ఈ ఘటన జరగ్గా.. ఈ ఏడాది జులైలో కొయిలాండీ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

దీంతో ఆయన కోళికోడ్‌ సెషన్స్‌ కోర్టును ఆశ్రయించారు. తన ప్రత్యర్థులు కావాలనే తనను ఈ కేసులో ఇరికించారని ఆరోపిస్తూ బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా నాటి ఘటన సమయంలో సదరు యువ రచయిత్రి ఫొటోలను కూడా కోర్టుకు సమర్పించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఫిర్యాదుదారు అయిన ఆ యువతి రెచ్చగొట్టే విధంగా దుస్తులు ధరించినందున సెక్షన్‌ 354ఏ కింద లైంగిక వేధింపుల ఆరోపణలు నిలబడవు అని వెల్లడించింది.

‘‘బెయిల్‌ దరఖాస్తుతో దాఖలు చేసిన ఫొటోల్లో ఫిర్యాదుదారు వేసుకున్న దుస్తులు లైంగికంగా రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. ఇక, ఈ కేసులో నిందితుడు బలవంతంగా ఆమెను లోబర్చుకోవాలన్న ఉద్దేశమో లేదా, అసభ్య వ్యాఖ్యలు చేసినట్లు ఆధారాలు లేవు. అందువల్ల సెక్షన్‌ 354ఏ కింద ఫిర్యాదుదారు చేస్తోన్న ఆరోపణలు నిలబడవు. అంతేగాక, 74 ఏళ్ల వయస్కుడైన, దివ్యాంగుడైన నిందితుడు చంద్రన్‌ ఒకరిపై ఆధారపడాల్సిందే తప్ప ఆయన మరొకరిని బలవంతంగా తీసుకెళ్లడం అనేది అసాధ్యమే అని కోర్టు విశ్వసిస్తుంది’’ అని న్యాయస్థానం వెల్లడించింది. ఈ కేసులో నిందితుడికి బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని