కొత్త కరోనా రకాలు ప్రమాదకరమే..

కొత్త కరోనా రకాలు విజృంభిస్తున్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Published : 21 Feb 2021 14:05 IST

అప్రమత్తంగా ఉండాలంటూ నిపుణుల హెచ్చరిక

దిల్లీ: దేశంలో సమూహ వ్యాధినిరోధకత అనే భావనే ఓ మిధ్య అని.. కొత్త కరోనా రకాలు విజృంభిస్తున్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పూర్తి జనాభాకు సామూహిక విధానంలో రక్షణ లభించాలంటే, వారిలో కనీసం ఎనభై శాతం మంది యాంటీ బాడీలను కలిగిఉన్నపుడు కానీ సాధ్యం కాదని ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ముఖాముఖిలో ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా వెల్లడించారు. భారత్‌లో వ్యాపిస్తున్న కొత్త కరోనా రకాల విషయంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఇవి అతి సులువుగా వ్యాప్తించే లక్షణాలను కలిగి ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే కరోనా వచ్చి తగ్గిన వారిలో, యాంటీబాడీస్‌ ఉన్నవారిలో కూడా  మళ్లీ ఆ వ్యాధి సోకేందుకు ఇవి కారణం కాగలవని ఆయన వివరించారు.

అలా తప్పించుకుంటున్నాయి..

దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 240 కరోనా రకాలను గుర్తించామని.. మహారాష్ట్రలో గత వారం రోజులుగా కొవిడ్‌ కేసులు మళ్లీ ఇబ్బడి ముబ్బడిగా పెరిగేందుకు ఇవే కారణమని ఆ రాష్ట్ర కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ బృంద సభ్యుడు డాక్టర్‌ శశాంక్‌ జోషి తెలిపారు. కాగా, మహారాష్ట్రతో పాటు కేరళ, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ఘడ్‌, పంజాబ్‌లలో కేసుల తాకిడి ఇటీవల గణనీయంగా పెరుగుతూ వస్తోంది. పరివర్తనల కారణంగా కొత్త కరోనా రకాలకు వ్యాధినిరోధకతను తప్పించుకోగల శక్తి లభిస్తోందని డాక్టర్‌ గులేరియా వివరించారు. అంటే టీకా వల్ల, వ్యాధి వచ్చి తగ్గటం వల్ల లేదా మరే ఇతర విధానంలోనైనా ఇమ్యూనిటీ లభించినవారికి కూడా ఇవి మరోసారి వ్యాధి వచ్చేలా చేస్తాయన్నారు.

ఏం చేయాలంటే..
ఈ పరిస్థితుల్లో కొవిడ్‌ ప్రవర్తనా నియమావళిని సక్రమంగా పాటించటం ఒకటే మార్గమని అని ఆయన మరోసారి స్పష్టం చేశారు. అంతేకాకుండా భారత్‌లో పరీక్షలు, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, ఇసోలేషన్ ప్రక్రియలను మరోసారి మరింత చురుగ్గా చేపట్టాలని ఆయన సూచించారు. కొత్త కరోనా రకాలపై వ్యాక్సిన్‌ పనితీరును గురించి ప్రశ్నించగా.. ప్రస్తుతమున్న టీకాలు ప్రభావం చూపుతాయని ఐతే వాటి ప్రభావం తక్కువగా ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని