Herd Immunity: ఆ విధంగా హెర్డ్ ఇమ్యూనిటీ సాధించడం అవివేకమే..!

కొవిడ్‌-19తో పోరాడటానికి సహజ ఇన్‌ఫెక్షన్ ద్వారా మంద రోగనిరోధక శక్తి (Herd Immunity) పొందాలనే ఆలోచన అవివేకమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్ అన్నారు.

Published : 04 Feb 2022 02:08 IST

WHO చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్

దిల్లీ: కొవిడ్‌-19తో పోరాడటానికి సహజ ఇన్‌ఫెక్షన్ ద్వారా రోగనిరోధక శక్తిని (Herd Immunity) పొందాలనే ఆలోచన అవివేకమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్ అన్నారు. దీనికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. కరోనా కట్టడిలో టీకాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని ఆమె స్పష్టం చేశారు. డబ్ల్యూహెచ్‌ఓ ఇప్పటికీ దీనికే కట్టుబడి ఉందని ఆమె తెలిపారు. ఓ జాతీయ వార్తా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరోనాకు సంబంధించి పలు విషయాలు చెప్పారు. ఒమిక్రాన్‌ సబ్‌వేరియంట్‌ BA.1తో పోలిస్తే BA.2 మరింత శక్తివంతమైందని, దీని వ్యాప్తి అన్ని వేరియంట్లకంటే వేగంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా ఇది భారత్‌, డెన్మార్క్‌ వంటి దేశాల్లో పట్టుసాధిస్తోందన్నారు. అయితే ఒమిక్రాన్‌లో ఉత్పరివర్తనాలు ఎక్కువగా ఉండడం వల్ల దాని ప్రభావంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంకా ఏం వ్యాఖ్యానించలేదన్నారు. ఒమిక్రాన్‌ తిరిగి రీఇన్‌ఫెక్షన్‌కు కారణమవుతుందా లేదా దీర్ఘకాలిక రోగనిరోధక శక్తిపై ప్రభావితం చూపిస్తుందా అనే విషయంపై ఇంకా అధ్యయనాలు జరుగుతున్నట్లు తెలిపారు.   

ఆసుపత్రుల్లో కొవిడ్‌ రోగుల చేరికలు, మరణాలను తగ్గించడంలో వ్యాక్సిన్లు కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. కరోనా ముప్పు అధికంగా ఉన్న వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు టీకాలు తీసుకోవడం వల్ల రక్షణ పొందుతున్నట్లు వాస్తవ ఫలితాలు రుజువు చేస్తున్నాయన్నారు. టీకాలు ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని వీటి ద్వారా స్పష్టమవుతోంది. ప్రస్తుతం భయపెడుతున్న ఒమిక్రాన్‌ వేరియంట్‌పై కూడా వ్యాక్సిన్‌లు పనిచేస్తున్నాయన్నారు. ఇదే సమయంలో కేవలం సహజ ఇన్ఫెక్షన్ వల్ల రోగనిరోధక శక్తి పొందాలనుకోవడం అవివేకమన్నారు. కేవలం వ్యాక్సిన్ల వల్ల పొందడమే సురక్షితం’ అని  సౌమ్య స్వామినాథన్ మరోసారి స్పష్టం చేశారు. ప్రస్తుతం మనం హైబ్రిడ్‌ ఇమ్యూనిటీని కలిగి ఉన్నట్లు ఆమె తెలిపారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని