మేనకకు పీటర్‌ సింగర్‌ ప్రైజ్‌

ఎంపీగా, జంతువుల హక్కుల కోసం పోరాడుతున్న సమాజ సేవకురాలిగా దేశవ్యాప్త గుర్తింపును సొంతం చేసుకున్న మేనకా గాంధీకి ‘పీటర్‌ సింగర్‌ ప్రైజ్‌’ వచ్చింది. ఈ విషయాన్ని ఆమె తనయుడు, ఫిలిబిత్‌ ఎంపీ వరుణ్‌ గాంధీ ట్విటర్‌లో వెల్లడించారు.

Updated : 18 Aug 2022 12:15 IST

తల్లిని అభినందించిన వరుణ్‌ గాంధీ

దిల్లీ: ఎంపీగా, జంతువుల హక్కుల కోసం పోరాడుతున్న సమాజ సేవకురాలిగా దేశవ్యాప్త గుర్తింపును సొంతం చేసుకున్న మేనకా గాంధీకి ‘పీటర్‌ సింగర్‌ ప్రైజ్‌’ వచ్చింది. ఈ విషయాన్ని ఆమె తనయుడు, ఫిలిబిత్‌ ఎంపీ వరుణ్‌ గాంధీ ట్విటర్‌లో వెల్లడించారు. జంతు సంరక్షణ కోసం చాలా ఏళ్లుగా కృషి చేస్తున్న తన తల్లికి ఆయన ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. జీవితంలో జంతువుల సంరక్షణకే అధిక ప్రాధాన్యమిచ్చిన తన తల్లి కన్నా ఈ ప్రైజ్‌  పొందడానికి అర్హులుగా మరొకరిని ఊహించుకోలేనంటూ ఆ పోస్టులో వ్యాఖ్యానించారు. జంతువుల సంరక్షణ, వాటి హక్కులను కాపాడేందుకు కృషి చేసిన వారికి పీటర్‌ సింగర్‌ ప్రైజ్‌ అందజేస్తుంటారు. ఆరో పీటర్‌ సింగర్‌ ప్రైజ్‌ను మేనకా గాంధీ, ఏడో ప్రైజ్‌ను రిచర్డ్‌ రైడర్‌ అనే మరో జంతు ప్రేమికుడు అందుకోనున్నారు. జంతు హక్కుల పరిరక్షణ కార్యకర్త, తత్వవేత్తగా ఆస్ట్రేలియాకు చెందిన పీటర్‌ సింగర్‌ సుప్రసిద్ధుడు. జంతువుల హక్కుల కోసం ఉద్యమించిన వారిలో ఆయన అగ్రగామి. 1975లో ఆయన రాసిన ‘యానిమల్‌  లిబరేషన్‌’ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 20 భాషల్లోకి అనువాదం అయింది. ఆధునిక కాలంలో జంతు హక్కుల పరిరక్షణ ఉద్యమానికి ఈ పుస్తకం స్ఫూర్తిగా నిలిచింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని