డ్రోన్‌ దాడికి అవకాశం.. దిల్లీలో  హై అలర్ట్‌

దేశ రాజధాని దిల్లీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముందు ఉగ్రదాడి జరగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. జమ్మూకశ్మీర్‌లోని భారత వాయుసేనకు చెందిన

Updated : 20 Jul 2021 15:46 IST

దిల్లీ:  దేశ రాజధాని దిల్లీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముందు ఉగ్రదాడి జరిగే ప్రమాదముందన్న నిఘావర్గాల హెచ్చరికతో  భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. జమ్మూకశ్మీర్‌లో భారత వాయుసేనకు చెందిన వైమానిక స్థావరంపై ఇటీవల విద్రోహ డ్రోన్‌ దాడి జరిగిన విషయం తెలిసిందే.  అదే తరహాలో పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రమూకలు పేలుడు పదార్థాలతో కూడిన డ్రోన్లతో ఈ సారి దిల్లీపై విరుచుకుపడే అవకాశం ఉన్నట్లు నిఘావర్గాల నుంచి అందిన సమాచారం మేరకు భద్రతా సంస్థలు నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశాయి. భారత ప్రభుత్వం 2019, ఆగస్టు 5న జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేకహోదా కల్పిస్తున్న అధికరణం 370ని రద్దు చేసింది.  ఈ నేపథ్యంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు విఘాతం కలిగించేందుకు నగరంలోని పలు కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని పాక్‌ ఉగ్రమూకలు దాడులకు పాల్పడొచ్చని భద్రతా సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. రానున్న కొద్ది రోజుల్లో నగరంలో అశాంతిని సృష్టించడానికి ఉగ్రమూకలు పెద్ద కుట్రనే పన్నుతున్నాయని భద్రతా సంస్థలు పేర్కొన్నాయి. ఈ అంశంపై దిల్లీ పోలీసులను సైతం అప్రమత్తం చేశాయి.

ఇంటెలిజెన్స్‌ విభాగం సహా నగరంలోని పోలీస్‌ ఠాణాలను దిల్లీ పోలీస్‌ కమిషనర్‌ బాలాజీ శ్రీవాస్తవ అప్రమత్తం చేశారు. డ్రోన్‌ దాడులకు అవకాశమున్న ప్రాంతాలపై ప్రత్యేకంగా నిఘా పెట్టాలని ఆదేశించారు. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ప్రత్యేకంగా కంట్రోల్‌ రూమ్‌ను సైతం పోలీసులు ఏర్పాటు చేశారు. చారిత్రక ఎర్రకోట వద్ద నాలుగు యాంటీ డ్రోన్‌ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు. విద్రోహ డ్రోన్‌ దాడులను సమర్థంగా తిప్పికొట్టేందుకు పోలీసులు, భద్రతా దళాలకు తొలిసారిగా శిక్షణ ఇస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని