UP Corona: ఇక అంతా దేవుడి దయ

కరోనా రెండో దశలో ఉత్తర్‌ప్రదేశ్‌(యూపీ)లో అందుబాటులో ఉన్న వైద్యసౌకర్యాల పట్ల అలహాబాద్ హైకోర్టు తీవ్ర విచారం వ్యక్తం చేసింది.

Updated : 21 Dec 2022 15:33 IST

అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యలు

అలహాబాద్: కరోనా రెండో దశలో ఉత్తర్‌ప్రదేశ్‌(యూపీ)లో అందుబాటులో ఉన్న వైద్యసౌకర్యాల పట్ల అలహాబాద్ హైకోర్టు తీవ్ర విచారం వ్యక్తం చేసింది. విచారణలో భాగంగా..‘అంతా దేవుడి దయ’ అంటూ గ్రామీణ ప్రాంతాలు ఎదుర్కొంటున్న దుర్భర స్థితిపై వ్యాఖ్యానించింది. కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలంటూ వేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది. దానిలో భాగంగా ముగ్గురు సభ్యుల కమిటీ సమర్పించిన అంశాలను ప్రస్తావించింది. వాటిలో ఏప్రిల్‌లో మేరఠ్‌ ఆసుపత్రి నుంచి అదృశ్యమైనట్లు చెప్తోన్న సంతోశ్ కుమార్ కేసు గురించి మాట్లాడుతూ.. ఆసుపత్రి యంత్రాంగం తీరును తప్పుపట్టింది.

‘‘ఆసుపత్రిలో చేరిన సంతోశ్‌ కుమార్ అనే వ్యక్తి.. రెస్ట్‌ రూమ్‌లో కుప్పకూలిపోయారు. వెంటనే అతణ్ని తీసుకొచ్చి చికిత్స అందించినప్పటికీ, ప్రాణాలు కోల్పోయారు. కానీ, వైద్యులు, ఇతర సిబ్బంది మాత్రం దాన్ని ‘గుర్తు తెలియని’ మృతదేహంగా రికార్డు చేశారు. ఆ సమయంలో రాత్రివిధుల్లో ఉన్న వైద్యుల నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ఠ’’ అంటూ కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

అలాగే రాష్ట్రంలో ఉన్న వైద్య సదుపాయాల గురించి ప్రస్తావించింది. ‘ఈ కొద్ది నెలల్లోనే వైద్యవ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో గ్రహించాం. సాధారణ సమయాల్లోనే అవసరాలు తీర్చలేని వ్యవస్థ..ఈ మహమ్మారి కాలంలో కూలిపోవాల్సిందే. బిజ్నోర్‌ జిల్లా విషయానికొస్తే..అక్కడ లెవెల్-3 ఆసుపత్రి లేకపోవడం షాకింగ్‌గా ఉంది. ఉన్న మూడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో 150 పడకలు మాత్రమే ఉన్నాయి. వెంటిలేటర్ల గురించి చెప్పనవసరం లేదు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 32లక్షల మందికి 10 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. అంటే మూడు లక్షల మందికి 30 పడకలు. ఆక్సిజన్ సిలిండర్ల సామర్థ్యం, వాటి నిర్వహణపై శిక్షణ పొందిన సిబ్బంది..ఇలాంటి వివరాలు ఏవీ లేవు’ అంటూ తీవ్ర ఆసహనం వ్యక్తం చేసింది. ఈ సమయంలోనే ‘ఇక అంతా దేవుడి దయ’ అంటూ వ్యాఖ్యానించింది.  

ఇప్పటివరకు ఉత్తర్‌ప్రదేశ్‌లో 16.28లక్షల మందికి కరోనా సోకగా..17,871 మరణాలు సంభవించాయి. వైద్యసౌకర్యాల కొరతపై విమర్శలు వస్తున్నప్పటికీ..అలాంటిదేమీ లేదంటూ అక్కడి ప్రభుత్వం చెప్తోంది. మరోవైపు, కొద్ది రోజుల క్రితం గంగానదిలో కొవిడ్ అనుమానితుల మృతదేహాలు వెలుగుచూడటం దేశాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని