Published : 28 May 2022 02:28 IST

CharDham: చార్‌ధామ్‌ యాత్ర.. ఆందోళనకర రీతిలో యాత్రికుల మరణాలు!

నెలలోపే 78 మంది యాత్రికుల మృతి

దేహ్రాదూన్‌: కొవిడ్‌ కారణంగా నిలిచిపోయిన చార్‌ధామ్‌ యాత్ర.. రెండేళ్ల విరామం తర్వాత మొదలు కావడంతో వేల మంది ఊపిరి పీల్చుకున్నారు. ఓ వైపు భక్తులతోపాటు యాత్రపైనే ఆధారపడి జీవనం సాగించే ఎంతో మందికి ఉపశమనం కలిగింది. కానీ, ఈసారి చార్‌ధామ్‌ యాత్ర మొదలైన నెలరోజుల్లోపే 78 మంది యాత్రికులు మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోవడం కలవరపెడుతోంది. మునుపటి యాత్రలతో పోలిస్తే ఈ ఏడాది మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో యాత్రికులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఈ ఏడాది రికార్డు స్థాయిలో..

ఉత్తరాఖండ్‌ మంచుకొండల్లోని దేవాలయాలను సందర్శించేందుకు ప్రతిఏటా లక్షల మంది యాత్రికులు వెళ్తుంటారు. అయితే, ఎత్తైన ప్రదేశాలకు వెళ్లే కొద్ది గుండె, శ్వాసకోస సంబంధింత సమస్యలున్నవారిలో కొందరు ప్రాణాలు కోల్పోవడం చూస్తూనే ఉన్నాం. కానీ, ఈసారి మాత్రం అనూహ్య రీతిలో మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా మునుపటితో పోలిస్తే మరణాల రేటు ఎక్కువగా ఉండడం కలవరపెడుతోంది. 2019లో మొత్తం 90 మంది చార్‌ధామ్‌ యాత్రికులు ప్రాణాలు కోల్పోగా 2018లో 102 మంది, 2017లో 112 మంది చనిపోయారు. అయితే ఇవి దాదాపు ఆరు నెలలపాటు కొనసాగే యాత్రలో చోటుచేసుకున్న మొత్తం మరణాలు. కానీ, ఈసారి మే 3న యాత్ర ప్రారంభం కాగా ఇంకా నెల రోజులు కూడా పూర్తికాకుండానే 78 మంది చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

ఇవే కారణమా..?

చార్‌ధామ్‌ యాత్రలో ఈ ఏడాది ఎక్కువ మరణాలు జరగడానికి నిపుణులు పలు కారణాలు చెబుతున్నారు. ముఖ్యంగా కొత్త వాతావరణానికి అలవాటు పడకపోవడం (Acclimatisation), కొవిడ్‌ బారినపడిన తర్వాత వారిలో రోగనిరోధకత తగ్గడం, ప్రతికూల వాతావరణంతోపాటు భారీ సంఖ్యలో యాత్రికులు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ సరిపడా ఏర్పాట్లు చేయకపోవడం వంటివి కారణం కావచ్చని విశ్లేషిస్తున్నారు. ఎత్తైన కొండల్లోని వాతావరణానికి యాత్రికులు తొందరగా అలవాటుపడకపోవడం.. వాటితోపాటు అందుకు అనువైన దుస్తులు కూడా ధరించకపోవడం మరో కారణమని కేదార్‌నాథ్‌ మార్గంలో వైద్య శిబిరం నిర్వహిస్తున్న ప్రదీప్‌ భరద్వాజ్‌ పేర్కొన్నారు. ఈ మార్గంలో చనిపోయిన యాత్రికులను పరిశీలించినప్పుడు ఇవే విషయాలు తెలిశాయన్నారు. అత్యంత శీతల వాతావరణం వల్ల ఏర్పడే హైపోథెర్మియా (Hypothermia) కారణంగా వారు చనిపోయినట్లు గుర్తించామని ప్రదీప్‌ భరద్వాజ్‌ వెల్లడించారు.

నిర్లక్ష్యం వద్దు..

యాత్రకు వచ్చే భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఆరోగ్య సూచనలను వారు పట్టించుకోవడం లేదని కేదార్‌నాథ్‌-బద్రీనాథ్‌ మందిర్‌ సమితి ఛైర్మన్‌ అజేంద్ర అజయ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కొవిడ్‌ కారణంగా అనారోగ్యం బారిన పడినవారితో పాటు కోలుకున్న తర్వాత ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నవారు ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను పాటించాలని.. కానీ కొందరు యాత్రికులు వాటిని గాలికి వదిలేస్తున్నారని అన్నారు. ముఖ్యంగా వృద్ధుల్లోనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని.. యాత్రకు వచ్చే వారు తప్పనిసరిగా వైద్యపరీక్షలు చేయించుకోవాలని అజేంద్ర అజయ్‌ సూచించారు. ఇక చార్‌ధామ్‌ యాత్రలో భాగంగా ప్రధాన ఆలయాల మార్గాల్లో ఇప్పటివరకు మొత్తం 78 మంది ప్రాణాలు కోల్పోగా. వీరిలో అత్యధికంగా 41 మంది కేదార్‌నాథ్‌కు వెళ్లే మార్గంలోనే చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని