Simultaneous Polls: ‘జమిలి ఎన్నికల కమిటీ’ తొలి భేటీ.. పార్టీల అభిప్రాయాల సేకరణకు నిర్ణయం

జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ శనివారం తొలిసారి సమావేశమైంది. ఈ అంశంపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలను సేకరించాలని నిర్ణయించింది.

Published : 23 Sep 2023 17:39 IST

దిల్లీ: ‘ఒకే దేశం - ఒకే ఎన్నికల (One Nation, One Election)’ నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ (Ram Nath Kovind) నేతృత్వంలో ఓ ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ శనివారం దిల్లీలో తొలిసారి సమావేశమైంది. ఈ సందర్భంగా సభ్యులకు స్వాగతం పలికిన కమిటీ ఛైర్మన్‌ కోవింద్‌.. సమావేశ అజెండాను వివరించారు. ఈ క్రమంలోనే జమిలి ఎన్నికలపై సూచనలు, అభిప్రాయాలను సేకరించేందుకు గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీలను ఆహ్వానించాలని కమిటీ నిర్ణయించింది.

‘జమిలి ఎన్నికలపై సూచనలు, అభిప్రాయాల సేకరణకు.. గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు, పార్లమెంటులో తమ ప్రతినిధులు ఉన్న పార్టీలు, గుర్తింపు పొందిన ఇతర రాష్ట్ర పార్టీలను ఆహ్వానించాలని కమిటీ నిర్ణయించింది. దీంతోపాటు భారత న్యాయ కమిషన్‌ను కూడా కమిటీ ఈ మేరకు ఆహ్వానించింది’ అని ఒక ప్రకటన వెలువడింది. అవసరమైన దస్త్రాల సన్నద్ధత, సంబంధిత పక్షాలతో సంప్రదింపులు ఎలా నిర్వహించాలి? జమిలి ఎన్నికలపై పరిశోధన.. తదితర అంశాలు సమావేశ అజెండాలో భాగమైనట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

కేంద్రం కీలక నిర్ణయం.. ‘ఒకే దేశం- ఒకే ఎన్నికల’పై కమిటీ..

ఇదిలా ఉండగా.. జమిలి ఎన్నికల విషయమై కేంద్ర ప్రభుత్వం ఈ నెల 2న ఎనిమిది మంది సభ్యులతో ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. అయితే, లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌధరి ఈ కమిటీలో సభ్యుడిగా ఉండేందుకు నిరాకరిస్తూ కేంద్ర హోంమంత్రికి లేఖ రాశారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తోపాటు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, రాజ్యసభలో మాజీ విపక్ష నేత గులాంనబీ ఆజాద్‌, 15వ ఫైనాన్స్‌ కమిషన్‌ మాజీ ఛైర్మన్‌ ఎన్‌.కె.సింగ్‌, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్‌ సుభాష్‌ సి.కశ్యప్‌, సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే, మాజీ సీవీసీ సంజయ్‌ కొఠారి ప్రస్తుతం కమిటీలో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని