మద్యం కుంభకోణం కేసు.. ఈడీ ముందుకు ఎమ్మెల్సీ కవిత

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో భారాస ఎమ్మెల్సీ కవిత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. కవితతో పాటు ఆమె భర్త అనిల్‌, న్యాయవాదులు ఉన్నారు. తుగ్లక్‌ రోడ్‌లోని కేసీఆర్‌ నివాసం నుంచి 10 వాహనాల కాన్వాయ్‌లో ఈడీ ఆఫీస్‌కు కవిత చేరుకున్నారు.

Updated : 11 Mar 2023 14:29 IST

దిల్లీ: దిల్లీ మద్యం కుంభకోణం కేసులో భారాస ఎమ్మెల్సీ కవిత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. ఆమెతో పాటు ఆమె భర్త అనిల్‌, న్యాయవాదులు ఉన్నారు. తుగ్లక్‌ రోడ్‌లోని కేసీఆర్‌ నివాసం నుంచి 10 వాహనాల కాన్వాయ్‌లో బయలుదేరి ఈడీ ఆఫీస్‌కు చేరుకున్నారు. అనంతరం తన పిడికిలి బిగించి అభివాదం చేస్తూ కవిత ఈడీ కార్యాలయంలోకి వెళ్లారు. కవితకు మద్దతుగా మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఈడీ కార్యాలయానికి వచ్చారు. వాస్తవంగా గురువారమే విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. 11న వస్తానని ఆమె ఈడీని కోరారు. ఈ నేపథ్యంలో ఇవాళ విచారణకు హాజరయ్యారు. ఆమెకు మద్దతుగా భారాస శ్రేణులు, నేతలు ఈడీ కార్యాలయం వద్దకు భారీగా చేరుకుంటున్నారు.

గత 3 రోజులుగా కేసీఆర్‌ నివాసంలోనే కవిత ఉంటున్నారు. ఆమెను నేడు విచారించనున్న వేళ.. ఈడీ కేంద్ర కార్యాలయం పరిసరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. భారాస కార్యకర్తలు, నేతలు ఈడీ కార్యాలయానికి చేరుకోకుండా దిల్లీ పోలీసులు ముమ్మర భద్రతా చర్యలు తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే దిల్లీ చేరుకున్న కేటీఆర్‌, హరీశ్‌రావు సహా పలువురు మంత్రులు ఆర్ధరాత్రి వరకు న్యాయనిపుణులతో చర్చలు జరిపినట్లు సమాచారం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని