G20 agri meet: దిగుమతి నుంచి ఎగుమతుల దేశంగా ఎదిగాం

వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కోవడంతోపాటు 2030 నాటికి ఏర్పడే ఆహార డిమాండ్‌ను అందుకునేందుకు.. వ్యవసాయ రంగ పరిశోధన, అభివృద్ధిలో పెట్టుబడులను పెంచాల్సిన అవసరం ఉందని భారత్‌ అభిప్రాయపడింది...

Updated : 13 May 2022 11:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కోవడంతోపాటు 2030 నాటికి ఏర్పడే ఆహార డిమాండ్‌ను అందుకునేందుకు.. వ్యవసాయ రంగ పరిశోధన, అభివృద్ధిలో పెట్టుబడులను పెంచాల్సిన అవసరం ఉందని భారత్‌ అభిప్రాయపడింది. అక్టోబరులో ఇటలీలో జరగనున్న జీ-20 శిఖరాగ్ర సమావేశంలో భాగంగా శనివారం ముందస్తుగా నిర్వహించిన జీ-20 వ్యవసాయ మంత్రుల సమావేశంలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ పాల్గొన్నారు. ‘రీసెర్చ్‌ యాజ్‌ ఏ డ్రైవింగ్‌ ఫోర్స్‌ బిహైండ్‌ సస్టెయినబిలిటీ’ అంశంపై ఆయన ప్రసంగించారు. ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకునే దేశం నుంచి ఎగుమతి చేసే దేశంగా భారత్‌ ఎదిగిందని, ఈ క్రమంలో వ్యవసాయ పరిశోధన కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం వార్షికంగా 308 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తితో ఆహార భద్రతను సాధించడంతోపాటు ఇతర దేశాల అవసరాలనూ తీర్చుతున్నామన్నారు.

రైతుల ఆదాయం పెంచే దిశగా చర్యలు

‘భారత్‌ జనాభా 2030-32 నాటికి 150 కోట్లకు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో.. ఆహార ధాన్యాల డిమాండ్ కూడా 350 మిలియన్ టన్నులకు చేరుతుందని భావిస్తున్నాం. కానీ.. తరిగిపోతున్న సహజ వనరులు, వాతావరణ మార్పుల కారణంగా ఈ డిమాండ్‌ మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఆహార స్వావలంబన సాధించే దిశగా డిజిటల్ వ్యవసాయం, సేద్య పరికరాలు, పర్యావరణ హిత పంట రకాల అభివృద్ధి, నాణ్యత తదితర అంశాల్లో తమ పరిశోధనలు కొనసాగుతాయ’ని చెప్పారు. ఈ చర్యలన్నీ పంట ఉత్పాదకతతోపాటు రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా ఉంటాయని వివరించారు. ఆహార భద్రత, పోషకాహారం, వ్యవసాయ అభివృద్ధి తదితర అంశాలపై చర్చించేందుకు 2011లో పారిస్‌లో మొదటి జీ-20 వ్యవసాయ మంత్రుల సమావేశం నిర్వహించారు. 2015 నుంచి ఏటా కొనసాగిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని